ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ తరువాత దాదాపు నెంబర్ టు స్థానంలో ఉన్న ఆర్దిక మంత్రి బుగ్గన రాజధాని అమరావతి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అందునా సింగపూర్ వేదికగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. టీడీపీ..బీజేపీ..జనసేన పార్టీలు రాజధాని తరలిస్తే సహించేది లేదని తేల్చి చెప్పాయి. అయితే..ముఖ్యమంత్రి జగన్ మాత్రం దీని మీద ఇంత వరకు మాట్లాడలేదు. అదే సమయంలో కొందరు మంత్రులు రాజధాని తరలింపు ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. ిక, తాజాగా ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంధ్ర నాధ్ సింగపూర్ లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. అందులో బుగ్గన చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే అసలు రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటనేది స్పష్టత వస్తుంది. అదే సమయంలో అధికార వికేంద్రీకరణ పైనా మంత్రి తమ అభిప్రాయం స్పష్టం చేసారు.
అమరావతి నిర్మాణానికి నిధుల సమస్య.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తేల్చి చెప్పారు. డెవలప్ మెంట్ అనేది ఒక నగరానికే పరిమితం చేయమని.. అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేయటం..అందరికీ సుస్థిర జీవం.. అన్ని చోట్లా ఉత్పాదక రంగం ద్వారా అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలని స్పష్టం చేసారు. అమరావతిలో ఆర్దిక నగరానికి మాత్రమే సింగపూర్ సంస్థలు పరిమితమని స్పష్టం చేసారు. అదే సమయంలో అమరావతిని తాము విస్మరించటం లేదని దీని పై నిర్ణయం తీసుకోవటానికి కొన్ని నెలలు పడుతుందని స్పష్టం చేసారు. ఒకే చోట డెవలప్ మెంట్ కేంద్రీకరించటం కంటే రాష్ట్రం అంతా వికేంద్రీకరరించటం పైనే ప్రభుత్వం ఫోకస్ చేసిందని మంత్రి..ప్రభుత్వంలోకి కీలక అధికారులు వివరించారు. ఏపీలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం..4 నౌకాశ్రయాలు.. ఆక్వా..ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడి దారులతో కలిసి పని చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దగా ఉందని స్పష్టం చేసారు. సింగపూర్ మంత్రి సైతం ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల అయిందని..వారికి నిర్ణయాలు తీసుకోవటానికి మరింత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.
మంత్రి బుగ్గన అమరావతి మీద జరుగుతున్న ప్రచారానికి దాదాపు క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అమరావతి తమకు తక్షణ ప్రాధాన్యత కాదని స్పష్టంగా చెప్పేసారు. అదే సమయంలో అమరావతిని తాము విస్మరించటం లేదని తేల్చి చెప్పారు. దీని ద్వారా అమరావతి రాజధానిగా ఉండదని..మారుస్తారని జరుగుతన్న ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు. దీనికి కొనసాగింపుగా అమరావతిలో ఆర్దిక నగరం సింగపూర్ సంస్థలు నిర్మిస్తాయని చెప్పటం ద్వారా అమరావతి రాజధానిగా ఉంటుందనే విషయం స్పష్టం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ సమాఖ్య వ్యవస్థ లో రాష్ట్ర ప్రభుత్వానికే రాజధాని పై ఎలాంటి నిర్ణయం తీసుకొనే అధికారమైనా ఉంటుందని స్పష్టం చేసారు. దీని ద్వారా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్న కేంద్రం జోక్యం చేసుకోదనే విషయాన్ని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. అయితే..ముఖ్యమంత్రి రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే విషయం స్పష్టంగా ఎందుకు చెప్పటం లేదని..దీని మీద అపోహలను తొలిగించే ప్రయత్నం ఎందుకు చేయటం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బుగ్గన వ్యాఖ్యల్లో పరమార్ధం రాజధాని కొనసాగుందునేది స్పష్టంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.