ఏపీలో అన్ని స్కూళ్లలో ఇంగ్లిషులోనే పాఠాలు

0
1062

ఏపీలోని సర్కారీ స్కూళ్ల రూపం మారిపోనున్నాయి. ఇప్పటివరకూ అమలు చేసిన విద్యా బోధనకు భిన్నంగా ఇంగ్లిషులోనే పాఠాలు చెప్పాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రానున్న ఏడాదిన్నరలో సర్కారు స్కూళ్ల రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తానని.. ఇప్పటికే మాటిచ్చిన జగన్.. అందుకు తగ్గట్లే కార్యాచరణను ప్రకటించారు. విద్యాశాఖపై చేపట్టిన సమీక్షలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ వరకూ విద్యను అందించాలన్న ముఖ్య నిర్ణయంతో పాటు.. ఒకటి నుంచి ఎనిమిది వరకూ ఇంగ్లిషులో పాఠాలు చెప్పాలన్నారు.

ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీని జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విడతల వారీగా ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఆయన.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఇంగ్లిషులోనే పాఠ్యబోదన జరగాలని.. ఆ తర్వాత తొమ్మిది.. పదో తరగతులకు విస్తరించాలన్నారు. ఏ శాఖలో అయినా పరీక్షల్ని జనవరిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న జగన్.. ఉపాధ్యాయులకు ఇంగ్లిషులో పాఠాలు చెప్పేందుకు వీలుగా శిక్షణ ఇవ్వాలన్నారు.

వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు ప్రారంభించే రోజునే యూనిఫారం.. బూట్లు.. స్కూలు బ్యాగులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటుకాలేజీలకు అనుమతులు ఇవ్వటం లేదన్నది నిజం కాదన్న జగన్.. సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? అన్నది చూస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారంగా అరటిపండు.. కిచిడీ.. పల్లీ చిక్కీలు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా జగన్ పథకాలుసిద్ధం చేశారని చెప్పక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here