కేంద్రం మొట్టికాయలు వేసినా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా, రివర్స్ టెండరింగ్ కే మొగ్గుచూపింది జగన్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్… పోలవరం రివర్స్ టెండరింగ్‌కు ఆమోదముద్ర వేసింది. మొత్తం 3216కోట్ల టెండర్ల రద్దుకు ఆమోదం తెలిపిన జగన్ కేబినెట్…. కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులను రికవరీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పోలవరం హైడల్ ప్రాజెక్టు విషయంలోనూ కీలక నిర్ణయమే తీసుకుంది. కేసు హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, నవయుగ సంస్థ హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది. అదేవిధంగా పనులు ప్రారంభించకపోవడంతో మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ సంస్థకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఇక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న ఆశావర్కర్ల విషయంలోనూ జగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాన్ని 10వేలకు పెంచాలన్న నిర్ణయానికి ఆమోదం తెలుపుతూనే, ఈ వారాంతానికల్లా ఆ నగదు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ మేరకు ఆటో-ట్యాక్సీ-క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు ఏడాదికి 10వేలు ఇఛ్చేందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా శ్రీరామనవమి నుంచి వైఎస్సార్ పెళ్లికానుక అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ.లక్ష… బీసీలకు రూ.50వేలు… దివ్యాంగులకు లక్షా 50వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే క్రీడాకారులకు జగన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తే 5లక్షలు… సిల్వర్ అయితే 4లక్షలు… బ్రాంజ్ అయితే 3లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇక, ఆర్టీసీ విలీనానికి కూడా జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బస్సు ఛార్జీల నియంత్రణకు కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆర్టీసీ విలీన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్టీసీ విలీనం తర్వాత ప్రజారవాణాశాఖ ఏర్పాటుచేసి, అందులోకి ఆర్టీసీ ఎంప్లాయిస్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోనున్నారు.
టీటీడీ బోర్డు సభ్యులను 16నుంచి 25కి పెంచేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకులను విలీనం చేసినా ఆంధ్రాబ్యాంకు పేరును మాత్రం యథావిధిగా కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్… సీపీఐ మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఒకే ఒక్క కేబినెట్ మీటింగ్ లో వంద నిర్ణయాలు అన్నట్లుగా జగన్ కేబినెట్ దూకుడు ప్రదర్శించింది.