హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలకుపైగా సమావేశం కావడం గమనార్హం.
నదీ జలాల అనుసంధానం : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు గోదావరి జిలాలు శ్రైశైలానికి తరలింపు, విభజన అంశాలపై చర్చించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల సంపూర్ణ వినియోగం కూడా వీరి మధ్య చర్చ వచ్చినట్లు తెలిసింది. గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని, వీలైనంత తక్కువ భూసేకరణతో నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రులు ఇద్దరు నిర్ణయించారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనేదానిపై చర్చించారు.
రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకరంగా ఉండేలా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని నేతలిద్దరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎంలు కేసీఆర్, జగన్లు నిర్ణయించారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్లోని సంస్థలపైనా ఇద్దరు సీఎంలు చర్చించారు. విభజన సమస్యలు బకాయిల చెల్లింపులపై ఇద్దరు ముఖ్యమంత్రులు మంతనాలు జరిపారు.
బ్రహ్మోత్సవాలకు రండి.. ఇది ఇలావుంటే, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం కేసీఆర్కు అందజేసి ఆహ్వానం అందించారు. జగన్ తోపాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.