టీడీపీ సీనియర్ నేత – మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. అధికార – ప్రతిపక్షాలు ఆయన ఆత్మహత్యకు కారణం మీరంటే మీరు అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
తాజాగా కోడెల ఆత్మహత్యపై ఫైర్ బ్రాండ్ – వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. కోడెల మృతికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం అని ఆమె ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు నాయుడే ఇప్పుడు కోడెల మరణానికి కూడా కారణమని రోజా సంచలన ఆరోపణలు చేశారు.
కోడెల వల్ల ఇబ్బంది పడిన వారంతా కేసులు పెట్టడంతో ఆయన చంద్రబాబును కలవాలని ప్రయత్నించారని.. కానీ చంద్రబాబు మాత్రం కోడెలను కలవకుండా ఆయనను ఒంటరిని చేసి అవమానించారని రోజా ఫైర్ అయ్యారు.
కోడెల మృతి విషయంలో ఆయనను దూరం పెట్టిన చంద్రబాబు హస్తం ఖచ్చితంగా ఉందని రోజా విమర్శించారు. కోడెలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టలేదని.. బాధితులే రోడ్డెక్కి పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేశారని రోజా చెప్పుకొచ్చారు. తాను నమ్మిన చంద్రబాబే తనను నట్టేట ముంచి అవమానించడంతో ఎమ్మెల్యే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని రోజా స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత వంగవీటి – ఇప్పుడు కోడెల మరణం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని రోజా సంచలన ఆరోపణలు చేశారు.