గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూల్స్ ఇవే…!

0
1023

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల సమయంలోనే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, ఎంపికయిన వారికి నియామకపత్రాలను పంపిణీ చేయటం జరిగింది. అక్టోబర్ నెల 2వ తేదీ నుండి ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయిన వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలను అందుకున్నవారు తప్పనిసరిగా 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. 30 రోజుల్లో విధులకు హాజరు కాని పక్షంలో హాజరు కాని వారిని ఎంపిక జాబితా నుండి తొలగిస్తారు. ప్రభుత్వ వైద్యశాలల నుండి ఈ ఉద్యోగాలలో చేరే అభ్యర్థులు బాడీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రంలో లేదా రాష్ట్రంలో పని చేస్తున్న వారు ఆ సంస్థల నుండి బయటకు వచ్చేసినట్లు ధ్రువపత్రం ఖచ్చితంగా సమర్పించాలి.

ఎవరైనా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలితే వారు ఉద్యోగం కోల్పోవటంతో పాటు ప్రభుత్వం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు గౌరవ వేతనం కింద 15,000 రూపాయలు చెల్లిస్తుంది. ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాల సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాలకు ఎంపికయిన వారిని విధుల నుండి తొలగించే అధికారం ఉంది.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నిర్దేశిత ప్రమాణాలకు తగిన ప్రతిభ కనబరిస్తే శాశ్వత స్కేలులోకి ప్రభుత్వం తీసుకుంటుంది. లేకపోతే ప్రభుత్వానికి తొలగించే హక్కు కూడా ఉంది. మూడు సంవత్సరాల కాలంలో ఉద్యోగం వదిలి వెళ్లాలనుకుంటే అప్పటివరకు అందుకున్న గౌరవ వేతనాలతో పాటు, భత్యాలు కూడా వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. పరిమితులకు, నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే నెల రోజుల నోటీసుతో ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here