చంద్రయాన్-2.. కోల్పోయింది 5 శాతం మాత్రమే!

0
1153

చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల పైన ల్యాండర్ నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి. చివరి 15 నిమిషాల్ని ఉద్విగ్న క్షణాలుగా చెప్పుకొచ్చిన ఇస్రో, ఆఖరి నిమిషంలో నియంత్రణ కోల్పోయింది. విక్రమ్ ల్యాండర్ ను మిస్ అయింది. అయితే ఇది పూర్తిగా ఫెయిల్ అయినట్టు కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తం చంద్రయాన్-2 మిషన్ లో కేవలం 5శాతం మాత్రమే కోల్పోయామని, మిగిలిన 95శాతం పరిపూర్ణ విజయం సాధించామని చెబుతున్నారు.

ప్రస్తుతానికైతే విక్రమ్ ల్యాండర్, అందులో ఉన్న ప్రగ్యాన్ రోవర్ ను మనం కోల్పోయినట్టే. అయితే అది మాత్రమే పూర్తి మిషన్ కాదు. చంద్రయాన్-2 ఆర్టిటార్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోంది. ప్రస్తుతం ఇది చక్కగా పనిచేస్తోంది. ఏడాది పాటు సేవలు అందిస్తుంది. చంద్రునికి సంబంధించిన ఎన్నో ఫొటోల్ని ఇది కమాండ్ కంట్రోల్ కు చేరవేస్తుంది. అంతేకాదు.. తన పరిభ్రమణంలో భాగంగా చేజారిపోయిన ల్యాండర్ ను కూడా ఇది ఫొటోలు తీసి భూమికి పంపిస్తుంది.

ఈనెల 2న ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడింది. దీని బరువు 1471 కిలోలు. వేరుపడినప్పట్నుంచి రాత్రి వరకు ఈ ల్యాండర్ పై నియంత్రణ కలిగి ఉన్నారు శాస్త్రవేత్తలు. చంద్రుని కక్ష్యలోకి ల్యాండర్ ను ప్రవేశపెట్టడంతో పాటు క్రమక్రమంగా చంద్రుని ఉపరితలానికి దాన్ని దగ్గర చేశారు. చంద్రుడిపై ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల చివరి 15 నిమిషాల ల్యాండింగ్ అత్యంత కష్టంతో కూడుకున్నదని ఇస్రో పదే పదే చెబుతూ వస్తోంది.

వాళ్ల భయమే నిజమైంది. ఆఖరి నిమిషంలో ల్యాండర్ అదుపుతప్పింది. కమాండ్ కంట్రోల్ ఆధీనం నుంచి పూర్తిగా పక్కకు జరిగింది. అది చంద్రునిపై క్రాష్ అయిందా లేక అంతే వేగంతో చంద్రుని కక్ష్యలోనే తిరుగుతుందా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అప్పుడే చెప్పలేకపోతున్నారు. సెకెనుకు వందల కిలోమీటర్ల వేగంతో చంద్రునిపై దిగే ల్యాండర్, తన వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలం అవ్వడం వల్లనే ఇదంతా జరిగినట్టు సైంటిస్టులు ప్రాధమికంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం తమకు అందిన సిగ్నల్స్ ను డీకోడ్ చేసే పనిలో సైంటిస్టులు ఉన్నారు. ల్యాండర్ అదుపు తప్పినప్పుడు తమకు అందిన ఆఖరి సిగ్నల్ కు సంబంధించిన గ్రాఫ్ ను కూడా ఇస్రో విడుదల చేసింది. ల్యాండర్ నుంచి తిరిగి సంకేతాలు అందుతాయా అందవా అనే విషయాన్ని అప్పుడే చెప్పలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here