బీజేపీ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడటం కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెడుతుంది. అయితే ఏపీలో బలపడటం అంత తేలికైన వ్యవహారం కాదని బీజేపీకి అర్ధం అయినట్టుంది. కానీ తెలంగాణలో మాత్రం బలపడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవడంతో ఫోకస్ మొత్తం ఇప్పుడు తెలంగాణ మీద పెట్టింది. తెలంగాణలో వయసు రీత్యా కేసీఆర్ ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేరు. తరువాత కేటీఆర్ నాయకత్వాన్ని ఎంత మంది ఆమోదిస్తారో తెలియదు. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. జగన్ భారీ మెజారిటీతో గెలిచారు. పైగా యువకుడు. ఇంకా మూడు దశాబ్దాలు రాజకీయాలు చేయగలడు. పైగా చంద్రబాబును తొక్కాలంటే జగన్ తోడు అవసరమని బీజేపీ భావిస్తుంది.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అయితే అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. దీనితో జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంతవరకు కష్టమని బీజేపీ అనుకుంటుంది.
అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. దీనితో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని దృడంగా నిశ్చయించుకుంది. అమిత్ షా కూడా తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేశారు. తెలంగాణలో తెరాస కు తామే ప్రధాన ప్రతి పక్షమని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనితో తెరాస లో ఎక్కడ లేని ఒణుకు మొదలైంది. ఎందుకంటే తెరాస పార్టీకి కాంగ్రెస్ ను ఎదుర్కోవటం సులభం గాని బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవటం అంత సులభం కాదు.