జగన్ పాలనకు వంద మార్కులేసిన టీడీపీ నేత

0
989

పాలనలో వంద రోజులు పూర్తిచేసుకున్న జగన్ కు నూటికి నూరు మార్కులు వేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు పడాల్సిందే అన్నారు. అవసరమైతే వందకు 110 మార్కులు కూడా వేయాలన్నారు.

“జగన్ పాలన గురించి అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. జగన్ కింద పడుతున్నాడు-లేస్తున్నాడు. చేయూతనిచ్చి నడిపించే వాళ్లు కనిపించడం లేదు. జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు పడాల్సిందే. ఇంకా ఎక్కువ మాట్లాడితే వందకు 110 మార్కులు కూడా వేయాలి. మా జగన్ కు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.”

ఇలా జగన్ ను ఆకాశానికెత్తేశారు జేసీ. అంతేకాదు.. జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు కూడా పరోక్షంగా చురకలు అంటించారు. పూర్తిస్థాయిలో అమల్లోకి రాకుండా గ్రామ సచివాలయం, ఆర్టీసీ విలీనం లాంటి అంశాలపై విమర్శలు చేయడం తగదన్నారు.

“ఆర్టీసీ విలీనం, గ్రామ సచివాలయం వల్ల ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది. కానీ గ్రామ సచివాలయం అనే కాన్సెప్ట్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు కదా. అది వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఈలోగానే విమర్శలు చేస్తే ఎలా? పాపం మా వాడు (జగన్) చాలా కష్టపడి, మేధావులతో మాట్లాడి ఇంత చేస్తే, ఒక్క వాక్యంలో కొట్టిపారేయడం ఏం న్యాయం. జగన్ ను కనీసం గాలి పీల్చుకోనీయకుండా చేస్తున్నారు. ఏం మనుషులు వీళ్లు.”

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులే చేస్తున్నారని, కానీ వాటిని మరీ మైక్రోస్కోప్ లో పెట్టి చూడడం సరికాదన్నారు. జగన్ కు గాలి పీల్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదని పరోక్షంగా తన సొంత పార్టీ నేతలపైనే సెటైర్లు వేశారు జేసీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here