జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: దిండిలో పవన్ తో భేటీ

0
1301

రాజోలు: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు వంగవీటి రాధాకృష్ణ. దిండి రిసార్ట్స్ వేదికగా రాధా తాజా రాజకీయాలు, ఇతర పరిణామాలపై పవన్ తో చర్చించారు.

అంతకుముందు జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు వంగవీటి రాధా తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ కు చేరుకున్నారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ తో కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించారు.

రెండు రోజులపాటు దిండి రిసార్ట్స్ లో జనసేన పార్టీ మేథోమథన సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిండి రిసార్ట్స్ చేరుకున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు జనసేనాని. రెండురోజులపాటు సదస్సులో పవన్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో రెండు రోజులపాటు దిండి రిసార్ట్స్ లోనే పవన్ కళ్యాణ్ ఉండనున్నారు.

ఇకపోతే ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాకృష్ణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం వంగవీటి రాధాకృష్ణ మౌనంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు బీజేపీ లేదా వైసీపీలోకి చేరుతున్న నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ సైతం భవిష్యత్ దృష్ట్యా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి వంగవీటి రాధాకృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో వంగవీటి రాధాకృష్ణ చేరారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాలని కార్యకర్తలు గత కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాన జనసేన కండువాకప్పుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here