జాబిల్లి..అందినట్టే అంది: అంతరిక్షంలో చివరినిమిషం దారి తప్పిన చంద్రయాన్-2

0
1158

కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ – 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. విఫలమైంది. ఊరించి.. ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకుండా పోయాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయని ఆశించిన శాస్త్రవేత్తలకు చేదు సమాచారం అందింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం వైపు క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. కాలం గడుస్తున్నప్పటికీ.. ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో భూమితో సంబంధాలు తెగిపోయినట్లు ధృవీకరించారు.

చిట్టచివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడింది. గతి తప్పింది. దీనితోో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇస్రో ఛైర్మన్ శివన్ సహా ఏ ఒక్కరు కూడా తమ సీట్లల్లో కూర్చోలేకపోయారు. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో అయిదు సెకెన్ల తరువాత మళ్లీ విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఇక అంతే. అదే చివరిది.

విక్రమ్ ల్యాండర్ కనిపించకపోయిన కాస్సేపటి తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వెళ్లిపోయారు. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందనడానికి అదో సంకేతంగా భావించాల్సి వచ్చింది. ల్యాండర్ ఆచూకీ కనిపించలేదని కే శివన్ ప్రకటించారు. ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కు ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన అధికారికంగా ధృవీకరించారు. దీనితో శాస్త్రవేత్తల ఆవేదనలో మునిగిపోయారు. ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని శివన్ ప్రకటిస్తున్న సమయంలో ఆయన గొంతు వణికింది. దీనికి గల కారణాలను తాము అన్వేషించాల్సి ఉందని ఆయన విషణ్ణ వదనంతో ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here