టీడీపీకి ఇద్దరు మాజీ మంత్రుల గుడ్ బై!! బుజ్జగిస్తున్న చంద్రబాబు: వారి చూపు ఎటువైపు..!!

0
1066

టీడీపీలో మరో సారి కాపు కాక మొదలైంది. కీలక కాపు నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని చంద్రబాబు బుజ్జగిస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి బీజేపీ నుండి ఆపర్ ఉన్నా..వైసీపీ వైపు వారిద్దరూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పార్టీ వీడినట్లేనని చంద్రబాు సైతం ఒక అంచనాకు వచ్చారు.

ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా.. పార్టీని వీడేందుకు ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ముఖ్య నేతలు సైతం సిద్దం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, వీరంతా పార్టీ వీడకుండా చూసేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా మాజీ మంత్రులు ఇద్దరు చంద్రబాబు సూచనలతో ఆలోచనలో పడినా.. పార్టీ వీడి వెళ్లటం మాత్రం ఖాయమని చెబుతున్నారు. దీంతో..టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.

టీడీపీని వీడాలని ఇద్దరు మాజీ మంత్రులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు..ఆయన బంధువు మంత్రిగా పని చేసిన నారాయణ సైతం టీడీపీ వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి లోకేశ్ విశాఖకు వచ్చిన సమయంలోనూ ఆయన పర్యటనలో గంటా పాల్గొనలేదు. ఇక, విశాఖ నగరంలో భూ కుంభకోణం పైన విచారణ కోసం ఆయన తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు.

టీడీపీ విశాఖ నగరంలో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీంతో..అక్కడ కీలక నేతలు కొందరు వైసీపీలో అవకాశం లేని వారు బీజేపీ వైపు చూస్తున్నారు. గంటాతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనతో పాటుగా నారాయణను సైతం బీజేపీలోకి తీసుకెళ్లాలనేది గంటా ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే, నారాయణ ఎన్నికల తరువాత టీడీపీ లో యాక్టివ్ గా ఉండటం లేదు. అదే విధంగా రాజధాని మీద రగడ సాగుతున్నా ఆయన బయటకు రాలేదు. ఇప్పుడు పార్టీ మారటం పైన ఆయన గంటాతోనే ఉండే నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న గంటా పార్టీ మారితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీనికి సైతం గంటా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. దీంతో..రానున్న రోజుల్లో గంటా..నారాయణ తమ రాజకీయ భవితవ్యం పైన కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. త్రిమూర్తులు పార్టీ వీడినట్లేనా…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తోట త్రిమూర్తులు హాజరు కాలేదు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినా ఆయన సమావేశానికి రాలేదు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులు సైతం పార్టీ సమీక్షకు దూరంగా ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ ఇన్ ఛార్జ్ గా పని చేసిన వరపుల రాజా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసారు. నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా..పరోక్షంగా ఈ ఇద్దరి గురించే చంద్రబాబు వ్యాఖ్యాలు చేసినట్లు చెబుతున్నారు. ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ నేతలు సైతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పటికే త్రిమూర్తులతో మంతనాలు జరిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ తోనూ తోట త్రిమూర్తులు సంప్రదింపులు చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్తారని సమాచారం. ఈ వారంలోనే ఆయన అధికారికంగా వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం టీడీపీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, వారు వైసీపీలోకి వెళ్తే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలోనే వారు ఆలోచనలో ఉన్నారని.. దీని పైన ప్రత్యామ్నాయంగా అధికార పార్టీ నుండి హామీ వస్తే వారు టీడీపీ వీడటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

l

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here