టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పని చేయడంతో పాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన కీలక నేత పార్టీ మారబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు మళ్లీ పుంజుకోవాలని ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రయత్నాలు చేస్తుంటే… ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం పక్కచూపులు చూస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీకి చెందిన సీనియర్ నేత కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పని చేయడంతో పాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన కంభంపాటి రామ్మోహన్ రావు కూడా త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించే కంభంపాటి రామ్మోహన్ రావు… కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
కంభంపాటి ఎందుకు మౌనంగా ఉండిపోయారనే అంశంపై పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని… సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన కొంతకాలం నుంచి పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారని సమాచారం. టీడీపీ నుంచి బీజేపీలోకి సాధ్యమైనంత ఎక్కువ మంది నేతలను తీసుకెళ్లాలని భావిస్తున్న కమలనాథులు… కంభంపాటిని కూడా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.