మధ్యలో ఇరుక్కుపోయిన జనసేనాని

0
997

అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. సొంతంగా రాజకీయాలు చేయలేడు. అలాగని బహిరంగంగా చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోలేడు. ఇలా సగం సగం రాజకీయాలు చేస్తే జనాలు ఎటువంటి తీర్పు ఇచ్చారో మొన్నటి ఎన్నికల్లో వచ్చిన తీర్పే నిదర్శనం. అయినా పవన్ లో మార్పు రాలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై చాలా పెద్ద పరిశోధనలే చేసి నివేదిక సిద్ధం చేసినట్లు పవన్ పెద్ద బిల్డప్ ఇచ్చారు. తీరా నివేదికలతోని అంశాలను చూస్తే దాదాపు చంద్రబాబు ఆలోచనల్లో నుండి కాపీ కొట్టినవే. ఇంతోటి నివేదిక తయారు చేయటానికి 100 రోజులు వెయిట్ చేయటమెందుకో ? తానొక్కడే చెబితే జనాలు నమ్మరన్న అనుమానంతోనే చంద్రబాబు తన మాటలనే రెండోసారి పవన్ తో కూడా చెప్పించారు.

అయితే వాళ్ళిద్దరు మరచిపోయిందేమిటంటే ఇద్దరూ కలిసినా, విడివిడిగా ఎన్నిసార్లు చెప్పినా జనాలు నమ్మరని. మొన్నటి ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ఒకే విధమైన ఆరోపణలను, విమర్శలను చంద్రబాబు, పవన్ ఎవరికి వారే చేశారు. అయినా జనాలు ఇద్దరికీ కలిపి ఒకేసారి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. చంద్రబాబు ఛాయ నుండి బయట పడకపోతే రాజకీయంగా తన సమాధిని తానే కట్టేసుకోవటం ఖాయం.

చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగింపుదశకు వచ్చేసింది. ఇపుడు చంద్రబాబు ఆరాటమంతా తన కోసం కాదు. తన పుత్రరత్నం నారా లోకేష్ కోసమే. కానీ పవన్ అలాక్కాదు. రాజకీయంగా ఇపుడిపుడే అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సమయంలోనే సొంతంగా నిర్ణయాలు తీసుకుని రాజకీయం చేయకపోతే సోదరుడు చిరంజీవి లాగే రాజకీయంగా కనుమరుగు అయిపోవటం ఖాయం.

ఇపుడు పవన్ పరిస్దితి ఎలాగైపోయిందంటే చంద్రబాబును తాను వదిలేద్దామని అనుకున్నా తనను చంద్రబాబు వదిలేలా లేడు. చంద్రబాబును నమ్ముకుని రాజకీయంగా లాభపడిన వారు ఎవ్వరూ లేరన్న విషయం చరిత్రను చూస్తే అర్ధమవుతుంది. కాబట్టి తాను ఎటువంటి రాజకీయాలు చేయాలో నిర్ణయించుకోవాల్సింది పవన్ మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here