ఆంధ్రప్రదేశ్ లో విపక్ష టిడిపి ఎమ్మెల్యేలకు హైకోర్టు వరుసగా నోటీసులు జారీ చేస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితమే ఓ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు జారీ చేయగా మంగళవారం ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు – విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ – రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బలరాంతో పాటు తాజాగా నోటీసులు జారీ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్ లో తమకు సంబంధించిన పూర్తి వివరాలు పొందరుపరచలేదన్న పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. బలరాం తన రెండో భార్య అయిన కాట్రగడ్డ ప్రసూన వివరాలు ఇవ్వలేదని… ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజా విషయానికి వస్తే మాజీ మంత్రి గంటాపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కెకె.రాజు – రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ పై పోటీ చేసి ఓడిన మంత్రి మోపిదేవి వెంకటరమణ – విజయవాడ తూర్పులో గద్దెపై పోటీ చేసి ఓడిన వైసీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరపున ఎన్నికల ఏజెంట్ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషన్ల తరపున వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి – జస్టిస్ జి.శ్యాంప్రసాద్ – జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. ఇక ఈ ముగ్గురి విషయంలో పిటిషనర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధనలకు అనుగుణంగా అఫిడవిట్లో వివరాలు ఇవ్వాలని… వీరు అలా చేయలేదని తమ పిటిషన్లో ఆరోపించారు.