రజనీ ఎంట్రీ… బాబు బుక్కైపోయారబ్బా!

0
942
రజనీ ఎంట్రీ... బాబు బుక్కైపోయారబ్బా!

అధికారం కోల్పోయాక… జనంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయిన టీడీపీ నేతలకు ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు – ఆయన తనయుడు నారా లోకేశ్ లను అదే సోషల్ మీడియా వేదకగా వైసీపీ నేతలు కిందా మీదా పడేసి కొట్టేసినంత పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ ప్రధాన కార్యదర్శి – ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో టీడీపీ నేతలను ఓ ఆటాడుకుని – ఇప్పుడు ఆ డోస్ ను మరింతగా పెంచేశారనే చెప్పాలి. సాయిరెడ్డికి తోడుగా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలో బాబు అండ్ కోను చెడుగుడు ఆడుకుంటున్నారనే చెప్పాలి. అలా సోషల్ మీడియాలోకి దూసుకువచ్చిన వైసీపీ యువ మహిళా నేత – గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ దెబ్బకు చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారనే చెప్పాలి.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు సేవలందించేందుకు గ్రామ వలంటీర్ వ్యవస్థ కొత్గగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థలో ఉపాధి లభించిన వారంతా వైసీపీ అనుకూలురేనని టీడీపీ ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. ఇంతదాకా అయితే ఓకే గానీ… గ్రామ వలంటీర్లుగా ఎన్నికైన వారి గురించి చంద్రబాబు నిన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అటు వలంటీర్లను బాగానే ఇబ్బంది పెట్టగా… ఆ వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ నేతలను కూడా కలచివేశాయన్న వాదన వినిపించింది. అందుకే కాబోలు… అసలు వలంటీర్లు ఎలాంటి పనులు చేస్తున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేట్టేలా విడదల రజనీ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. సదరు ట్వీట్ లో బాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ… గ్రామాల్లో ప్రజలకు వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ ట్వీట్ తో వలంటీర్ల వ్యవస్థపై వ్యాఖ్యలతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారనే చెప్పక తప్పదు.

అయినా సదరు ట్వీట్ లో విడదల రజనీ ఏం పోస్టు చేశారన్న విషయానికి వస్తే… అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని అంబులెన్స్ లోకి ఎక్కించడంతో పాటుగా అప్పటికప్పుడు అవసరమైన అత్యవసర చికిత్సలను అందిస్తున్న మహిళా వలంటీర్ ఫొటోలను రజనీ అందులో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ప్రస్తావిస్తూ గ్రామ వలంటీర్లు ఎంత గొప్ప సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా… ఇంతటి ఉదాత్తమైన సేవలు అందిస్తున్న వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని కూడా రజనీ గట్టి కౌంటరే ఇచ్చారు. సదరు ట్వీట్ లో బాబును రజనీ ఎంతగా కడిగేశారంటే… ‘స్పృహ కోల్పోయిన ఒక అనాధ వ్యక్తిని చేరదీసి 108 వాహనం లోకి ఎక్కిస్తున్న ధర్మసాగరం గ్రామ వలంటీర్ బోయాలమ్మ. ఇలాంటి గొప్ప మనసున్న వాలంటీర్ల గురించి నిన్న చంద్రబాబు గారు చేసిన హృదయాన్ని నొచ్చుకునే వ్యాఖ్యలు బాధాకరం’ అంటూ బాబును నిజంగానే అడ్డంగా బుక్ చేసేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here