రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకే: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ స్పందన

0
961

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకే.. కోడెల శివప్రసాదరావు మృతి విషాదకరమన్న పవన్ కళ్యాణ్.. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పదవులు అలంకరించారని చెప్పారు. రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ వ్యాఖ్యానించారు.

పోరాడాల్సింది.. కోడెల శివప్రసాదరావు తనపై వచ్చిన రాజకీయ ఆరోపణలు, విమర్శలపై పోరాటం చేసుంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ సంతాప సందేశాన్ని విడుదల చేసింది.

షూటింగ్ రద్దు చేసుకుని.. కోడెల శివప్రసాదరావు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. కోడెల మరణవార్త విన్న వెంటనే సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడిన బాలకృష్ణ.. శారీరకంగా కోడెల మన నుంచి దూరమైన అందరి మనసుల్లో ఉంటారని అన్నారు. బసవతారకం ఆస్పత్రి దగ్గర బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

కోడెలది కీలక పాత్ర.. బసవతారకం ఆస్పత్రి నిర్మాణంలో, నిధులు సమకూర్చడంలో కోడెల కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 2000-2009 వరకు ఆస్పత్రికి ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. పలు మంత్రి పదవులు చేపట్టి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా కోడెల తన ముద్ర వేశారని చెప్పారు. కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బాలకృష్ణ.. ఆ దేవుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here