విద్యా శాఖలోనూ రివర్స్ టెండరింగ్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

0
1085

రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులను దోచుకున్నదని ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల ఖర్చు తగ్గిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మార్కాపురం డివిజన్ లోని సచివాలయ ఉద్యోగులుగా ఎంపికయిన వారికి నియామకపు పత్రాలు అందజేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే విద్యాశాఖలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి అన్నారు. దీని ద్వారా ఖర్చు తగ్గిస్తామని ప్రభుత్వ నిధులను కాపాడతామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ లో పలు సంస్కరణలకు తెర తీశామన్నారు.

ఇంకా పలు సంస్కరణలతో విద్యాశాఖను పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి అడుగులు పడ్డాయని, అందులో భాగంగానే రాష్ట్రం లో సచివాలయాలు ఏర్పాటు అవుతున్నాయని మంత్రి డాక్టర్ ఆదిమూలపు అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందనున్నాయని చెప్పారు. సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి 72 గంటల్లో ప్రజల సమస్యలకు పరిస్కారం చూపాలనే లక్ష్యంతో ఈ సచివాలయాలు ఏర్పడ్డాయన్నారు. అందులో పనిచేసెందుకు స్థానిక యువతకు అవకాశం ఇస్తానని పాదయాత్ర లో ఇచ్చిన హామీల అమలు నెరవేర్చి నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో స్థానిక సంస్థలను నిర్విర్యం చేసారని, ఇప్పుడు మీరు జగనన్న ఆశయ సాధనకు అవినీతి కి తావు లేకుండా పని చేయాలని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. పార్టీ, కులం, మతం చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూసి ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందించాలని కోరారు. రాజకీయాలకు తలొగ్గకుండా పని చేయటం ఉద్యోగులకు ఇబ్బందే అయినా ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో మాత్రం కేవలం అర్హత మాత్రమే చూడాలని ఇతర ఏ సిఫారసు, పార్టీలు చూడవద్దని సూచించారు. అమ్మవడి కార్యక్రమం ద్వారా 6, 456 కోట్లు తల్లుల ఖాతాలకు ఇస్తున్నామని, ఇందులో పార్టీలు చూడకుండా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా నిధులు ఇస్తామన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు అక్రమాలు జరిగాయని చెప్పటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఉద్యోగాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యే లు కానీ ఎవరికయినా సిఫారసు లేఖలు ఇచ్చినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు అర్హులకు అందజేయాలని, జగనన్న చేపట్టిన పాలన రాజన్న రాజ్యం స్థాపన కోసమన్నారు. ఉద్యోగాలు పొందినవారు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయాలని, తమకు ఫలానా చోట పోస్టింగ్ కావాలని మరలా మా వద్దకు సిఫారసు కోసం రాకూడదన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రెవిన్యూలో భూముల సర్వే సమస్య ఇప్పటి వరకు జటిలంగా ఉందనన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా వచ్చిన సర్వేయర్ లు ఆయా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నియామకపు పత్రాలను మంత్రి సురేష్ అందజేశారు. ఉద్యోగులకు పత్రాలు పంపిణీ చేసే స్టాళ్ళ వద్దకు వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్ డివో శేసిరెడ్డి, జే డి రామచంద్రమూర్తి, డీడి లక్ష్మీసుధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here