సుజనా సవాల్ ను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుందా?

0
925

రాజకీయాలన్నాక సవాళ్లు.. ప్రతిసవాళ్లు కామన్. కానీ.. తాజా రాజకీయం గతంలో మాదిరి లేదు. మాటా.. మాటా అనుకునే స్థాయి నుంచి వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లిపోయి చాలాకాలమే అయిపోయింది. అక్కడితో ఆగకుండా.. అంతకుమించి అన్నట్లుగా ఇప్పుడు మారింది. దీంతో.. నేతల మధ్య స్పర్థలు మాటల యుద్ధాల్ని మించి పోయి వ్యక్తిగత అంశాల్లోకి లోతుగా వెళ్లే పరిస్థితి వచ్చింది.

దీనికి తాజా నిదర్శనంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలుగా చెప్పాలి. రాజధాని భూములకు సంబంధించిన ఎంపీ సుజనా చౌదరిపై ఏపీ అధికార పక్షానికి చెందిన కీలక నేత విజయసాయి రెడ్డి విమర్శలు చేయటం.. దానిపై వాదనలు ముదిరాయి. సవాళ్లు.. ప్రతిసవాళ్ల వరకూ వెళ్లాయి. దీంతో.. ఈ ఇష్యూను జగన్ సర్కారు సీరియస్ గా తీసుకుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

రాజధాని పరిధిలో 2010 నుంచి ఒక్క అంగుళం భూమిని కొనుగోలు చేసినా చూపించాలంటూ సుజనా చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రియాక్ట్ కావటమే కాదు.. సుజనా పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సవాళ్ల వ్యవహారాన్ని లెక్క తేల్చేందుకు కృష్ణా జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు రికార్డుల తనిఖీల్లో మునిగిపోయినట్లుగా చెబుతున్నారు.

సుజనా భూములకు సంబంధించిన రికార్డుల వెలికితీతకు భారీ ఎత్తున కసరత్తు జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. సుజనాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ.. ఆయన సన్నిహితులు.. బంధువులకు సంబంధం ఉన్న భూలావాదేవీల మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. వాస్తవాల్ని తవ్వి తీసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నేతలు అన్నాక.. ఏదో ఒక డీల్ లో ఏదోలా సంబంధం ఉండకుండా పోదని.. ఇలాంటి సవాళ్లతో కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

అదే సమయంలో.. సుజనా నోటి నుంచి అంత తీవ్రమైన వ్యాఖ్య వచ్చిందంటే.. ఆయనకేమాత్రం సంబంధం లేని రీతిలో విషయాలు ఉన్నాయా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తంగా సుజనా వ్యవహారం ఏపీ ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన సవాల్ లో నిజం లేదన్న విషయాన్ని నిరూపించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. అనవసరమైన ఆవేశానికి పోయి సుజనా మాష్టారు సమస్యల్ని ఆహ్వానిస్తున్నారా? అన్నది కాలమే తేల్చాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here