హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ దాకా: వన్ ఇండియా..మెనీ లాంగ్వేజెస్: తెలుగులో మోడీ పలకరింపు

0
1355
హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ దాకా: వన్ ఇండియా..మెనీ లాంగ్వేజెస్: తెలుగులో మోడీ పలకరింపు

హ్యూస్టన్: వన్ ఇండియా.. వన్ లాంగ్వేజ్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మధ్యకాలంలో బలంగా చెబుతున్న మాట ఇది. ఒకే దేశం.. ఒకే భాషను ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు హిందీని అమలు చేయాలని ఆయన సూచన ప్రాయంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. అంతా బాగుంది.. అనే పదాన్ని ఎనిమిది భాషల్లో పలికారు. ప్రవాస భారతీయులను ఆత్మీయంగా పలకరించారు. నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ అంతా బాగుంది.. అనే పదాన్ని ఆయన వేర్వేరు భాషల్లో ఉచ్ఛరించారు.

అంతా బాగుందంటూ.. స్టేడియంలోనికి ప్రవేశించిన కొద్దిసేపటి తరువాత మొదట హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం భారత్ లో అంతా బాగుంది.. అనే పదాన్ని గుజరాతీ, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, పంజాబీ, బెంగాలీ, భోజ్ పురి భాషల్లో ఉచ్ఛరించారు. అమెరికాతో భారత్‌ కు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఈ రెండు దేశాల్లో ఉన్న ప్రధాన నగరాల పేర్లను ఉటంకించారు. హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు, బోస్టన్‌ నుంచి బెంగళూరు వరకు, చికాగో నుంచి షిమ్లా వరకు, లాస్‌ ఏంజెలిస్‌ నుంచి లూధియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ.. అంటూ తన భాషా చాతుర్యాన్ని ప్రదర్శించారు.

అబ్ కి బార్.. ట్రంప్ సర్కార్.. అనేక భాషలు, అనేక జాతులు.. దానితో పాటు భిన్న సంస్కృతి మన దేశంలో అంతర్భాగమని.. దాని వల్లే మన దేశానికి ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత అని చెప్పారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికా ఆర్థిక విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ బలోపేతం చేసిన తీరు అద్భతమని వ్యాఖ్యానించారు.

సంబంధాలు మరింత పటిష్టం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా.. అదే స్థానంలో కొనసాగడానికి ట్రంప్ చేయాల్సినదంతా చేస్తున్నారని అన్నారు. మరోసారి ట్రంప్ ను గెలిపించాలనే అర్థం వచ్చేలా `అబ్ కి బార్.. ట్రంప్ సర్కార్` అనే నినాదాన్ని వినిపించారు. ట్రంప్ హయాంలో భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలు మరింత పటిష్టం అయ్యాయని అన్నారు. ఈ బంధం చిరకాలం కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే రెండు దేశాలు పురోగమిస్తాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here