జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరగాడా. ఏ న్యాయస్థానం నిర్ధారించింది. జగన్ పై నమోదైన అభియోగాల పై న్యాయస్థానంలో వి చారణ జరుగుతోంది. మరి..ఆంధ్రజ్యోతి ఆర్కే జగన్ ను ఆర్దిక నేరగాడని ఎలా పిలుస్తారు. ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్తపలుకు లో జాతికి మోదీ జవాబివ్వాలి..! అనే శీర్షికన ప్రచురితం అయింది. కర్నాటకలో జరిగిన రాజకీయ పరిణామాల పై ఆర్కే తన విశ్లేషణ రాసుకొచ్చారు. అంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కర్నాటక లో బిజెపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నాల పై విమర్శలు చేసారు. అందులోనూ తప్పు లేదు. అయితే, ఇక్కడ ఒకటే ప్రశ్న. ఇదే రకంగా ఎక్కడ జరిగినా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మరి..ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల పై ఇదే తరహాలో ఎందుకు స్పందించలేదు. వైసిపి ఎమ్మెల్యేలను టిడిపి అధినాయకత్వం ప్రలోభాలకు గురి చేసి..తమ పార్టీలో ముఖ్యమంత్రే కండువా కప్పి చేర్చుకుంటే దానిని ఇదే విధంగా ఎందుకు ఎండ గట్టలేదు.
వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయిస్తుంటే అది వైసిపి బలహీనత..నాయకత్వ లోపం అంటూ కధనాలు ఇచ్చింది. ఇక, జగన్ పై నమోదైన కేసులు రాజకీయంగా నమోదైన కేసులుగా జగన్ మాత్రమే కాదు.. ముఖ్యమంత్రితో సహా..గతంలో కొత్త పలుకులోనూ స్పష్టం చేసారు. ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏ కేసులోనూ జగన్ నేరస్థుడిగా తేలలేదు. కానీ, ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రం తన కొత్తపలు కు లో జగన్మోహన్ రెడ్డిని ఆర్దిక నేరగాడు అంటూ రాసుకొచ్చారు. కోర్టులో కేసులు ఉన్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యానాలు రాయటం ఎంత వరకు కరెక్ట్ అనేది జవాబివ్వాలి. ఇక, తాజా రాజకీయాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు నేరుగా రంగ ప్రవేశం చేస్తే జాతీయ స్థాయి సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశం ఉందని రాసుకొచ్చారు. టిడిపి ఏం చేసినా తప్పుగా కనిపించదు. ఇది ఎంతో కాలంగా సాగుతున్న తీరు.
ఇక, తిరుమల వివాదం పైనా కొత్త పలుకులో ప్రస్తావించారు. రమణ దీక్షితులు అనే వివాదాస్పద పూజారి అంటూ పేర్కొన్నారు. ఇదే రమణ దీక్షితులు వివాదాస్పదు డు అయితే, ఇంత కాలం ఎందుకు ఆంధ్రజ్యోతి లో ఆయన చేసిన వివాదాల పై రాయలేదో జవాబివ్వాలి. ఇక, ఎవరు టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. వారిపై బురద చల్లటం పరిపాటిగా మారిపోయింది. ఇక, కర్నాటక గవర్నర్ గురించి.. తీరు గురించి ప్రస్తావించారు. అందులో అభ్యంతరం లేదు. ఏపి గవర్నర్ నరసింహన్ గురించి రాసుకొచ్చారు. మరి.. వైసిపి నుండి టిడిపలోకి ఫిరాయించ..వారిని మంత్రులుగా ప్రమాణం చేయించిన అంశంపై మాత్రం నరసింహన్ ను ఎందుకు ప్రశ్నించలేదు. టిడిపి చేస్తే ఒప్పు..మిగిలిన ఎవరు చేసినా తప్పు అనే విధంగా ఈ వ్యాసాలు ఉంటున్నాయనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. ఒక ప్రతిపక్ష నేత..పార్టీ అధినేతను ఆర్దిక నేరగాడు అనే ముద్ర వేసే అధికారం ఎక్కడిదో కూడా జవాబివ్వాలి…!!