ఆదినారాయణ రెడ్డిని ఓడించేది వారే. మంత్రి ఆది నారాయణరెడ్డి రాజకీయం కడప జిల్లాలో అగమ్య గోచరంగా మారుతోంది. ఆయనకే కాదు..ఆయనను అక్కున చేర్చుకున్న టిడిపికి సమస్యలు తెచ్చి పెడుతోంది. ఆదినారాయణరెడ్డి టిడిపి కి గుదిబండగా మారుతున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు లో ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి ప్రచ్ఛన్న యుద్దం పతాక స్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నాదంటే నాదంటూ ఇద్దరూ ఒకరి పై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఆది నారాయణ రెడ్డి అహంకార వైఖరి పార్టీకి నష్టం చేస్తున్నాయని రామ సుబ్బారెడ్డి మంత్రి ఆదిని కార్నర్ చేస్తున్నారు. ఇకవేల, వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగు టిక్కెట్ టిడిపి అధినాయకత్వం ఆది నారాయణరెడ్డికే ఇచ్చినా..రామసుబ్బారెడ్డి వర్గం ఆదిని ఓడించటానికే పని చేస్తుందని ఇప్పటికే టాక్ మొదలైంది. ఇక, ఆది నారాయణరెడ్డి తన నియోజకవర్గం జమ్మలమడుగు లోనే కాదు..ప్రతీ నియోజకర్గంలో తల దూర్చి మిగిలిన నేతలను ఇబ్బంది పెడుతున్నారు. బద్వేల్ రాజకీయాల్లో తాను పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మొదటికే మోసం తెస్తున్నాయి. తనతో పాటుగా వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్నారు. తన మనిషితో అక్కడ పోటీ చేయించాలని ఆది ఆశిస్తున్నారు.
తాజాగా ప్రొద్దుటూరు లో పార్టీ పంచాయితీతోనూ ఆది జోక్యం చేసుకుంటున్నారు. ఇదంతా ఆది నారాయణరెడ్డి మీదే కాదు.. టిడిపి మీద వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఇప్పటికే సొంత మనుషులు నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆది తన మీద పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోకపోగా..తన నోటి దురుసుతనం తో పెంచుకుంటున్నారు. ముందు నుండి టిడిపిలో ఉన్న వర్గాలు ఆది ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్ సొంత జిల్లాకు చెందిన..దగ్గరగా ఉన్న నేత కావటంతో పాటుగా సామాజిక వర్గం కలిసి రావటంతో..జగన్ పై అస్త్రంగా ఉపయోగపడతాడని ఆది నారాయణరెడ్డిని టిడిపి ప్రోత్సహించింది. జగన్ పై దూషణలకు మినహా..ఇప్పుడు ఆది నారాయణరెడ్డి పార్టీలో మరెందుకు ఉపయోగం లేకుండా పోయింది. కేశవరెడ్డి విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం నుండి మేలు పొందిన ఆదికి..ఇప్పుడు సొంత జిల్లాలోనే కాదు.. సొంత నియోజకవర్గంలోనూ అసమ్మతి జ్వాల పెరిగిపోతోంది. దీంతో..అది రాజకీయ భవిష్యత్ వచ్చే ఎన్నికల నాటికి మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసిపి సైతం ఆది ని టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో.. ఇక ఆది వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదనే విషయం అర్దమవుతోంది.