జమ్మలమడుగు లో అసమ్మతి రాజుకుంది. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి పై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఓపెన్ గానే ఫైర్ అవుతున్నారు. తాను ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్లు కాదని, తాను కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉన్నానని తేల్చేసారు. జమ్మల మడుగు నుంచి తానే పోటీచేస్తానని ఆదినారాయణ రెడ్డి ఎలా చెబుతారని రామ సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని నిలదీసారు. జమ్మలమడుగు టిక్కెట్ తనదేనని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎలా ప్రకటిస్తారని రామసుబ్బా రెడ్డి ఫైర్ అయ్యారు. తనకు ఎమ్మెల్సీ వచ్చే సమయంలో సీయం చంద్రబాబు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోతేదని హామీ ఇచ్చారనే విషయాన్ని రామసుబ్బారెడ్డి ఓపెన్ గా చెప్పేసారు. టిడిపి లో టిక్కెట్లు ప్రకటించే హక్కు జిల్లా నేతలకు ఉండదంటూనే, మంత్రి ఆది నారాయణ పార్టీ క్రమశిక్షణ కు తూట్లు పొడుస్తున్నారని, నియోజకవర్గంలో లేని పోని ప్రకటనలతో వర్గ పోరు పెంచుతున్నారని రామసుబ్బారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేసారు.
రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ద్వారా ఇక తనకు అడ్డులేదని, వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందని ఆదినారాయణ రెడ్డి అంచనా. దీనికి తగిన విధంగానే తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పోస్టుల విషయంలో తన మాట చెల్లుబాటు చేసు కొనే విధంగా అధిష్ఠానం పై ఒత్తిడి చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి టిడిపి లో చేరటాన్నే జీర్ణించుకోలేకపోయిన రామసుబ్బారెడ్డి అనుచరులు, వేచి చూసే ధోరణితో ఉన్నారు. జమ్మలమడుగు లో రామసుబ్బారెడ్డి వర్గం అసంతృప్తిని గమనిం చిన పార్టీ అధినేత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నం చేసారు. కానీ, నాయకుల కంటే వర్గపోరుకు చిరునామా అయిన జమ్మలమడుగు లో ఆ ఇద్దరి నేతల అనుచరలు మధ్య పొసగటం లేదు. ఇప్పటికే సొంత సోదరుల నుండి ఇంటి పోరు ఎదుర్కొంటున్న మంత్రి ఆదినారాయణ రెడ్డికి, ఉండదనుకున్న రామసుబ్బారెడ్డి నుండి అసమ్మతి పోరు క్రమంగా వేడెక్కుతోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆద్దంకి, కదిరి, బద్వేలు, ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అసమ్మతి పోరు టిడిపి అధినాయకత్వానికి సమస్యగా మా రుతోంది. వీటిలో జమ్మల మడుగు లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రామసుబ్బారెడ్డి సహాయ నిరాకరణ చేసినా అసమ్మతి కార్యక్రమాలు పెరిగినా, మంత్రి ఆది నారాయణరెడ్డికి ఇబ్బందులు తప్పవని స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు.