నెల్లూరు జిల్లాలో టిడిపి కి భారీ షాక్. పార్టీకి సీనియర్ నేత ఆనం రాజీనామా. నేరుగా రాజీనామా అని ప్రస్తావించకపోయినా తనను పార్టీ బాధ్యతల నుండి తప్పించాలని కోరుతూ టిడిపి అధినేతకు ఆనం లేఖ. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో పునరంకిత సభ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. దీని పై బాధ్యతలు తీసుకోవాలని జిల్లా నేతలతో పాటుగా ఆనంకు పార్టీ హైకమాండ్ నుండి సమాచారం పంపారు. నేరుగా జిల్లాకు చెందిన మంత్రి నారాయణ ఈ మేరకు ఆనం రామనారాయణరెడ్డి తో మాట్లాడారు. తాను పార్టీలో ఏ బాధ్యతలు స్వీకరించలేనని..ఎటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఉండలేనని ఆనం తేల్చిచెప్పారు. ఆనం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారని గ్రహించిన టిడిపి హైకమాండ్ ఆనంకు నామినేటెడ్ పోస్టు..జిల్లా టిడిపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమనే రాజీ ప్రతిపాదన ముందుంచుంది. దీనికి సైతం ఆనం ససేమిరా అన్నారు. తనకు అవి ఏవీ అవసరం లేదని తేల్చేసారు. కొద్ది రోజుల క్రితం ఆనంతో వైసిపి నేతలు బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి నెల్లూరు లో ఆనంతో ఏకాంత చర్చలు జరిపారు. దీంతో..ఆనం సైతం వైసిపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక, ఆత్మకూరులో జరిగిన మహానాడుతో పాటుగా రాష్ట్ర స్థాయి మహానాడుకు సైతం ఆనం గైర్హాజరయ్యారు. తన సోదరుడు ఆనం వివేకా మృతి తరువాత ఆనం పూర్తిగా టిడిపికి దూరమయ్యారు. ఇక, నెల్లూరు లో వైసిపి నిర్వహించిన వంచన పై గర్జన కార్యక్రమంలో నెల్లూరు నేతలు ఆనం వైసిపి లో ఎంట్రీ పై పరోక్షంగా కామెంట్లు చేసారు. పార్టీ బలోపేతం కోసం ఎవ రు వచ్చినా ఆహ్వానిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేసారు. దీంతో..ఆనం రామనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి త్వరలోనే వైసిపి లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.