ఆర్. నారాయణమూర్తి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, ఇప్పుడు అంత హవా లేదు కానీ, ఓ 15, 20 ఏళ్ల క్రితం ఆయన తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు వంటి సినిమాలతో తెలుగు తెరకు విప్లవం అద్దాడు, కోట్ల రూపాయలు సంపాదించినా, ఆ కోట్లు తన కోసం ఏమాత్రం ఖర్చు చేయని సినీయోగి ఆర్. నారాయణ మూర్తి, అలాంటి నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. అందుకే ఆయనకు అనేక పార్టీలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాయి కూడా. కానీ ఆయనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. వైసీపీ అధినేత జగన్ తుని టికెట్ ఇస్తామని ప్రపోజ్ చేశారట.
టీడీపీ కూడా కాకినాడ సీటు ఇప్పటికి మూడుసార్లు ఆఫర్ చేసిందట. గతంలో పీఆర్పీ కూడా రాజకీయాల్లోకి రమ్మని అడిగిందట. కానీ ఇష్టం లేక ఆ రంగంలోకి వెళ్లలేదట.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టారు ఆర్. నారాయణమూర్తి. ప్రజలతో ఉంటున్నా. ఉద్యమ సినిమాలు తీస్తున్నా.. అంతకంటే ఏం కావాలి అంటారు నారాయణమూర్తి. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగానే సేవ చేయొచ్చు కదా? అని అడిగితే.. ఏ రాజకీయ పార్టీలో అయినా చేరానే అనుకోండి. వాళ్లు చెప్పింది నేను చేయాలి. నాకు నచ్చకపోతే ఘర్షణ పడాలి. అది నాకు అవసరమా? నా రాజ్యంలో నేను రాజులా ఉంటున్నా. అక్కడకి వెళ్లి ఎందుకు తలొంచాలి? అంటూ తన ఫిలాసఫీ చెప్పారు ఆర్ నారాయణమూర్తి, దటీజ్ ఆర్.నారాయణమూర్తి.