ఆంధ్రజ్యోతి ని బిజెపి టార్గెట్ చేసిందా. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రజ్యోతి పని చెబుతామని బిజెపి నేతలు చెప్పటం ద్వారా ఏం జరగబోతోంది. బిజెపి నేతలు ఈ విషయం చెబుతున్నారంటూ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే తన కొత్త పలుకులో స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎన్డీఏతో టిడిపి తెగ తెంపులు చేసుకున్న తరువాత టిడిపి నేతలు బిజెపి ని టార్గెట్ చేసారు. నేరుగా ప్రధాని ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. తాజాగా, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షా తిరుమల పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేయటం తో, వీరిద్దరి మధ్య గ్యాప్ తారా స్థాయికి చేరింది. ఇక, కర్నాటక ఎన్నికల తరువాత కేంద్రం ఏపిలోని టిడిపి నేతలు, అధికారులు, చివరకు మీడియా పైనా చర్యలు దిగే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారు.
ఇప్పుడు, ఆంధ్రజ్యోతి ఎండి తన కొత్త పలుకు లో సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ హిట్ లిస్ట్‌లో ఫలానా వారు ఉన్నారని తెలుగు నాట విస్తృత ప్రచారం జరుగుతందని ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి. నరసింహారావు రాసిన వ్యాసాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి పై కూడా ఫిర్యాదులు వెళ్లాయని బిజెపి నేతలే చెబుతున్నారంటూ ఆర్కే తన కొత్త పలుకులో పేర్కొన్నారు. దీని పై తమ ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని కూడా వారు చెబుతున్నట్లు వివరించారు. కర్నాటక ఎన్నికల తరువాత ఆంధ్రజ్యోతి పని చెబుతామని బిజెపి నాయకులు తమ అంతరంగిక సంబాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి ఆర్కే తన కొత్తపలుకులో స్పష్టంగా రాసుకొచ్చారు.
దీని, ద్వారా ఇప్పుడు ఏపిలో ఇది హాట్ టాపిక్ అయింది. రెండు రోజుల క్రితం బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు సైతం వచ్చే మూడు నెలల కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, అన్ని పార్టీలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇక, టిడిపి అధినేత సైతం మీరు ఎవ్వరినీ భయపెట్ట లేరు అంటూ బిజెపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యా నించారు. అయితే, అసలు ఎటువంటి తప్పు జరగకపోతే టిడిపి నేతలు అంతగా కేంద్రం ఏదో చేస్తుందనే భయంతో ఎందుకు మాట్లాడుతున్నారని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక, మోదీ మార్కు రాజకీయం అంటూ ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన కొత్త పలుకులో తమపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని వస్తున్న వార్తలను ప్రస్తావించటం ద్వారా ఈ నెల 15 తరువాత ఏం జరుగబోతోందనే ఉత్కంఠ ఏపి ప్రజల్లో మొదలైంది. ఇక ఏపిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.