29న వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం…
వైసిపి -టిడిసి నువ్వా నేనా సై
వైసిపి ఎంపీల రాజీనామాల ఆమోదం ఖాయం. అందుకు ఈ నెల 29న ముహూర్తం ఖరారు. ఆగస్టులో ఉప ఎన్నికలకు అవకాశం. వైసిపి ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఆహ్వానం. ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైసిపి ఎంపీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయం నుండి ఆహ్వానం అందింది. ఈ నెల 29న లోక సభ స్పీకర్ను కలవాలని వర్తమానం అందించారు. ఈ మేరకు ఈ నెల 29న స్పీకర్ ను కలిసేందుకు రాజీనామా చేసిన అయిదుగురు వైసిపి ఎంపీలు సిద్దమయ్యారు. ఏప్రిల్ 24న ఎంపీ పదవులకు వైసిపి ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, వర ప్రసాద్, మిధున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో తమ రాజీనామాలను నేరుగా స్పీకర్ కు అందచేసారు. అదే సమయంలో స్పీకర్ రాజీనామాల పై పునరాలోచించాలని సూచించారు.
ఇక ఆలోచించేది ఏమీ లేదని ఎంపీలు తేల్చి చెప్పారు. ఆ వెంటనే వైసిపి ఎంపీలు ఢిల్లీలోని ఏపి భవన్ ప్రాంగణంలో ఆమరణ దీక్షకు దిగారు. రాజీనామాలు చేసి నెల రోజులు పూర్తి కానుండటంతో..మరోసారి ఎంపీలతో చర్చించి..వీటి పై నిర్ణయం తీసుకోవా లని స్పీకర్ నిర్ణయించినట్లు సమా చారం. రాజీనామాల ఆమోదం పై స్పీకర్ తో చర్చించే సమయంలోనూ వాటిని ఆమోదించాలని కోరుతామని..ఇందులో మరో ఆలోచన లేదని వైసిపి ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. ఖచ్చితం గా స్పీకర్ అదే రోజున అయిదుగురు వైసిపి ఎం పీల రాజీనామాలు ఆమోదించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇక, ఈ అయిదుగురి రాజీనామాలు ఆమోదం పొందిన వెంటనే ఏపిలోని అయిదు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తారు. ఇప్పటికే మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ అయిదు కలిస్తే మొత్తం 12 స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. తాజాగా, కర్నాటకలో యడ్యూరప్ప , శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయగా..స్పీకర్ వాటిని ఆమోదించారు. ఈ స్థానాలకు జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ఉప ఎన్నికలు జరగవచ్చని అంచనా. ఇప్పటికే టిడిపి అధినేత సైతం అయిదు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయనే అభిప్రాయాన్ని పార్టీ నేతల ముందుంచారు.
నెల్లూరు పార్లమెంటరీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై…ఉప ఎన్నికకు సిద్దం కావాలని సూచించారు. ఇక, ప్రత్యేక హోదా కోసం పదవులు త్యాగం చేసిన వారిగా వైసిపి ఎంపీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రజలు తిరిగి వారినే ఎంపీలుగా గెలిపించి..ఏపికి ప్రత్యేక హో దా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటుతారని వైసిపి నేతలు చెబుతున్నారు. మరి..టిడిపి తాము అధికారంలో ఉన్నా మని..ఉప ఎన్నికలు తమకే అనుకూలంగా ఉంటాయంటూ నంద్యాల ఎన్నికను గుర్తు చేస్తున్నారు. అయితే, నంద్యాల ఉప ఎన్నిక కోసం టిడిపి 13 మంది మంత్రులను..50 మంది ఎమ్మెల్యేలను మొహరించింది. ఇప్పుడు అయిదు లోక్‌సభ స్థానాలు అంటే దాదాపుగా 35 అసెంబ్లీ స్థానాల్లో ఈ రకమైన మేనేజ్‌మెంట్ సాధ్యం కాదని వైసిపి నేతలు చెబుతున్నారు. త్వరలో నెల్లూరు, తిరుపతి, రాజంపేట, కడప, ఒంగోలు లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగితే ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో మీరే మీ కామెంట్ల ద్వారా వాస్తవ పరిస్థితిని వివరించండి.