ఏపిలో ఎవరి మీద కేంద్రం చర్యలు తీసుకోబోతుందా సీయం చెప్పేసారా. ఇది ముఖ్యమంత్రి అనుమానమా. సమాచారం గా భావించాలా. ఏపిలో మీడియా పై కేంద్రం కక్ష్య సాధింపు చేస్తుందా. సీయం వ్యాఖ్యల్లో పర మార్ధం ఏంటి. ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌గా నే కాకుండా బ్యూరోక్రసీలోనూ చర్చకు కారణమయ్యాయి. కొంత కాలంగా ఏపిలో ఐఏయస్ అధికారులు, పొలిటికల్ లీడర్స్ అవినీతి పై కేంద్రం దృష్టి సారించిందంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో ఐఏయస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, మీడియా పైనా కేంద్ం కక్ష్యసాధించే అవకాశం ఉందంటూ చెప్పటం తో దీని పై తర్జన భర్జన లు జరుగుతున్నాయి.
ఏపి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని అయిదుగురు సీనియర్ ఐఏయస్ అధి కారులపై కేంద్రం దృష్టి సారించిందనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి సైతం అదే దారిలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయంగా సానుభూతి కోసం చేసిన వ్యాఖ్యలా లేక పూర్తి సమాచారం తో చేసిన కామెంట్లా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇక, మీడియా సంస్థల పైనా కేంద్రం కక్ష్య సాధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సిబిఐ కేసులు పెట్టి వేధించాలని చూస్తే అంతకు అంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సీయం హెచ్చరిస్తున్నారు. అయితే, కేంద్రం వేధింపుల పేరుతో ఇటువంటి చర్యలకు దిగుతుందా, అసలు కేంద్రం అందుకు సిద్దమవుతుందని ఎందుకు అనుమానిస్తున్నానేది విశ్లేషకుల సందేహం. కొంత కాలంగా పార్టీ సమావే శాల్లోనూ, బహిరంగ సభల్లోనూ కేంద్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇదే సమయం లో ఎటువంటి చర్యలు తీసుకున్నా అండగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అసలు, కేంద్రం అటువంటి చర్యలు దిగుతుందనే అనుమానం టిడిపి నేతలకు ఎందుకు కలుగుతుందనే దాని పై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక, ఏ తప్పు చేయని అధికారి పైనా, పారిశ్రామిక వేత్త పైనా కేంద్రం చర్యలకు ఎందుకు ధైర్యం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేంద్రం ఏం చేస్తుందో అనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. వస్తున్న అవినీతి ఆరోపణల పైనా బాధ్యుల పైనా చర్యలకు దిగితే రాజకీయంగా మద్దతు సానుభూతి కోసమే టిడిపి నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏదైనా అవినీతికి పాల్పడిన వారి పై చర్యలకు కేంద్రం సిద్దమైందనే సమాచారం పక్కగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక, రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి.. నిజంగా కేంద్రం అటువంటి చర్యలకు దిగితే..రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే..






