ఏపిలో అయిదు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయం. వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతున్నాయి. ఇది చెబుతుంది వైసిపి ఎంపీలు కాదు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపికి ప్రత్యేక హోదా కోసం వైసిపికి చెందిన అయిదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసారు. ఆ వెంటనే ఆమరణ దీక్ష చేసారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన తమ రాజీనామాలను ఆమోదించాలని ఇప్పటికే వైసిపి ఎంపీలు స్పీకర్ను కోరారు. మరోసారి కలిసేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో టిడిపి నేతల తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఆ సమావే శంలో కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ రెండు తరువాత వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయని, తడాఖా చూపిద్దామంటూ పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, నంద్యాల ఉపఎన్నిక కోసమే 13 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలను, టిడిపి మొహరించింది. అయితే, ఇప్పుడు అయిదు లోక్‌సభ స్థానాలకు ఆ విధంగా మేనేజ్ మెంట్ చేయటం సులువైన విషయ మేమి కాదు. ఈ సంగతి టిడిపి నేతలకు బాగా తెలుసు. అయితే, ఏపికి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసిపి ఎంపీల పై టిడిపి పోటీ పెట్టటానికే సిద్దమవుతున్నట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఏపికి ప్రత్యేక హోదా కోసం పదవులు త్యాగం చేస్తే వారి పై పోటీకి దిగటం ద్వారా టిడిపి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక, పోటీ చేసినా పదవులు వదులుకున్న వారిగా వైసిపి ఎంపీలనే ప్రజలు తిరిగి గెలిపించటం ఖాయంగా కనిపిస్తోంది. వైసిపి నేతలు తాము ప్రజల్లోకి వెళ్లి హోదా సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో చాటుతామని ఇప్పటికే పలు మార్లు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ పాదయాత్ర ద్వారా ప్రతీ జిల్లాలోనూ విశేష స్పందన కనిపిస్తోంది. కడప, రాజంపేల, నె ల్లూరు, తిరుపతి, ఒంగోలు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏడాది లో సాధారణ ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో..ఇప్పుడు వైసిపి ఈ స్థానాలను గెలుచుకోవటం ద్వారా కేడర్లో కొత్త జోష్ నింపేందుకు ఉప యోగపడుతుందని వైసిపి నేతలు అంచనా వేస్తున్నారు.
మరి, టిడిపి పై పెరుగుతున్న అసంతృప్తి కేడర్లో నిస్తేజం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జూన్ మొదటి వారంలో వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే అదే నెలలో ఎన్నికల సంఘానికి లోక్‌సభ స్థానాలను నోటిఫై చేస్తూ లోక్‌సభ సచివాలయం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. దీంతో, దాదాపుగా ఆగస్టులో ఏపిలో అయిదు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయం లో స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎంపీల ఫిరాయింపు అనర్హత పిటీషన్ల పైనా నిర్ణయం ఉండవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ఉప ఎన్నికల స్థానాల సంఖ్య ఏడుకు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దాదాపుగా ఆ ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా టిడిపి-వైసిపి మధ్య హోరా హోరా పోరుకు వేదికగా మారనున్నాయి.