ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టిడిపికి షాక్. నారావారి పల్లె ఉన్న నియోకవర్గం చంద్రగిరికి చెందిన టిడిపి నేత గల్లా అరుణ టిడిపి వీడారు. కొద్ది రోజుల క్రితం చంద్రగిరి టిడిపి ఇన్‌ఛార్జ్ పదవికి అరుణ రాజీనామా చేసారు. టిడిపి లో సరైన ప్రాతినిధ్యం దక్కటం లేదని అరుణ అవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తాను తన ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక, తాజాగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలు జెడ్‌పిటిసిలు, ఎంపీటి సీలు, సర్పంచ్‌లతో సమావేశయ్యారు. ఆరు గ్రామాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. టిడిపిని వీడాలని నిర్ణయించినట్లు చెప్పి..వారి అభిప్రాయం సేకరించారు. వారంతా కూడా టిడిపిని వీడాలని ముక్త కంఠంతో సూచించారు. ఇప్పుడు గల్లా అరుణ వైసిపి లో చేరాలని నిర్ణయించారు. తన అనుచరులతో కలిసి గల్లా అరుణ వైసిపి లో చేరటం ఖాయమైంది. వైయస్ హయాంలో రెండు సార్లు గల్లా అరుణ మంత్రిగా పని చేసారు. 2014 ఎన్నికల్లో టిడిపిలో చేరి చంద్రగిరి నుండి పోటీ చేసి వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో ఓడిపోయారు. గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం టిడిపి నుండి గుంటూరు ఎంపిగా ఉన్నారు. జయదేవ్ సైతం పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. అరుణ టిడిపి వీడటం..అందునా పార్టీ అధినేత సొంత జిల్లా..సొంత నియోజకవర్గం కావటంతో ఇప్పుడు టిడిపి వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. గల్లా అరుణ త్వరలోనే జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకోనున్నారు. గల్లా అరుణ వైసిపి లో చేరటం వలన సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డికి పార్టీలో ఎక్కడా ప్రాధాన్యత తగ్గదని వైసిపి నేతలు స్పష్టం చేస్తున్నారు.