కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ టిడిపి ప్రారంభించిందా. కేంద్రం దెబ్బకు అడగకుండా నే కావాల్సిన సమాచారం ఢిల్లీకి చేరుతోందా. ఏఉపిలో ఉన్నత స్థాయి వర్గాలు మాత్రం ఇది నిజమేనని చెబుతున్నాయి. ఏపి ప్రభుత్వంలో పని చేసిన సీనియర్ సివిల్స్ అధికారులు, ఏపిలో కీలక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇక్కడ లోగుట్టు మొత్తం ఢిల్లీ గుప్పిట్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ నుండి టిడిపి బయటకు రావటం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రధాని మోదీని, టార్గెట్ చేసి టిడిపి అధినాయకత్వం విమర్శలు చేయటాన్ని ఢిల్లీ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏపిలో తమను డామేజ్ చేయటం వారికి రుచించటం లేదు. దీంతో ఏపిలో జరుగుతున్న అవినీతి పై నాలుగేళ్లుగా జగన్ చేస్తున్న విమర్శలనే ఇప్పుడు పవన్ కళ్యాన్, బిజెపి నేతలు మొదలు పెట్టారు.
బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏకంగా పట్టిసీమ పై సిబిఐ విచారణ కోరుతున్నారు. ఇక, పోలవరంలో అక్రమాలు జరుగుతున్నాయని అన్ని పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏపి ప్రభుత్వం అవినీతి పై ఇంత తీవ్ర స్థాయిలో అరోపణలు వస్తున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ఏపిలో జరిగిన అక్రమాల పై దృష్టి పెట్టిందని ఢిల్లీలో సాగుతున్న చర్చ. కర్నాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఏపి పై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపి లో దేనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయో వాటి మీద కేంద్ర సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే సమయంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు రాజధాని వ్యవహారం పై ఏకంగా కేసు వేసారు. ఆయన తన ఆరోపణలకు తగిన విధంగానూ పూర్తి సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని తెలుస్తోంది.
ఇక, సీయస్‌గా పని చేసి రిటైరైన మరో అధికారి అజయ్ కల్లాం సైతం మేలు కొలుపు పుస్తకం రాసారు. ఆయ సైతం కేంద్రానికి తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ముఖ్య పరిపాలనా కేంద్రం, మున్సిపల్ శాఖల్లో కీలక విభాగంలో పని చేసి ఢిల్లీలో మంచి పట్టుఉన్న అధికారులు సైతం కేంద్రానికి కావాల్సిన సమాచారం ఇవ్వటంలో సహకరిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఏపిలో ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్లను సైతం ఢిల్లీ పిలిపించి కావాల్సిన సమాచారం కేంద్ర అధికారులు సేకరించారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో, ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు రాజధానిలో అవినీతి బినామీలు అంటూ, వస్తున్న ఆరోపణల పై పూర్తి సమాచారం కేంద్రం సేకరిస్తున్నట్లు అర్దమవుతోంది.
రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారనే అభిప్రాయం కలగకుండా పూర్తిస్థాయి సమాచారంతో ఈ అవినీతి ఆరోపణల పై పక్కా చర్యలకు దిగాలనేది కేంద్ర వ్యూహంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకుంటున్న ఏపిలోని కీలక నేతలు, ఢిల్లీ కదలికల పై ఎప్పటి కప్పుడు సమాచారం తెప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సంస్థలు మాత్రం ఇప్పటికే తమకు అందిన ఫిర్యాదులు సమాచారం ఆధారంగా ఏక్షణంలో అయినా ఆపరేషన్ టిడిపి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఏపి సచివాలయంలోనూ చర్చించుకుంటున్నారు.