ఐఏయస్..ఐపియస్‌లు వైసిపి బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కీలక స్థానాల్లో ఉన్న ఈ అధికారులు ఇప్పుడు జగన్ వైపు ఎందుకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన అధికారులు సైతం బాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన వద్ద వ్యక్తి గత భద్రతాధికారిగా పని చేసిన మహ్మద్ ఇక్బాల్ టిడిపి నికాదని వైసిపి లో చేరారు. చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇక్బాల్ చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు.
అమరావతి పై ప్రభుత్వ తీరు ను తప్పు బడుతూ ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. ఆయన కర్నూలు జిల్లా చెందిన వ్యక్తి. ఇక, ప్రస్తుతం టిడిపి లో కీలకంగా వ్యవహిరిస్తున్న ఓ యువ మంత్రిశాఖలో ముఖ్య అధికారిగా పని చేస్తున్న మరో అధికారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆ యన కుటుంబ సభ్యులు వైసిపిలో ఉన్నారు. ఆ ఐఏయస్ అధికారి పైతం వైసిపి లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ప్రభుత్వం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు ఐవైఆర్ కృష్ణారావు. అజయ్ కళ్లాం సైతం పదవీ విరమణ చేసిన తరువాత ముఖ్యమంత్రి నిర్ణయాలు తూర్పార పడుతున్నారు. రాజకీయంగా వారు ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకపోయినా..వారిద్దరూ రాజధాని పై చేస్తున్న విమర్శలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైసిపి తొలి నుండి రాజధాని విషయంలో ఏదైతే చెబుతూ వస్తుందో ఇప్పుడు సీనియర్ అధికారులు సైతం అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం లో తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో లోపాలు ఉండటం తో చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న అధికారులు సైతం ఏపిలో పని చేయటానికి ఇష్టపడటం లేదు. దీంతో..వారు తెలంగాణ లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. ఒక రకంగా ఏపిలో ప్రస్తుతం సీనియర్ ఐఏయస్ అధికారులు కొరత ఏర్ప డింది. పాలనా వ్యవహారాల్లో ముఖ్య కేంద్రంగా నడిచే వ్యవహారాల్లో అనుభవం లేని అధికారుల నిర్ణయాల వలన తాము ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నామని సీనియర్లు వాపోతున్నారు.
ఇక, ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంలో సైతం ఎంతో కాలంగా పని చేస్తున్న ఓ అధికారి సైతం వైసిపి నేతలతో టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంద. తాను వచ్చే ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ అధికారి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వైసిపి కి చెందిన తిరుపతి ఎంపి వరప్రసా ద్ మాజీ ఐఏయస్ అధికారి. ఆయన ద్వారా కొంతమంది రిటైర్డ్ ఐఏయస్ లు వైసిపి లో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..ఎంతో కాలంగా చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇక్బాల్ లాంటి పోలీసు అధికారులు వైసిపి లో చేరటం ద్వారా…వాస్తవ రూపంలో టిడిపి కంటే వైసిపి క్షేత్ర స్థాయిలో ఎంత బలంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో మరి కొందరు సివిల్స్ అధికారులు వైసిపి లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది