ఆశోక్‌బాబు ఉద్యోగ సంఘ నేతా, టిడిపి అనుబంధ నాయకుడా. సమైక్య ఉద్యమం పేరుతో నాడు ద్రోహం చేసారని అశోక్‌బాబును ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ లాంటి వారు విమర్శిస్తూ ఉంటారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేసే సమయంలో మద్దతు ఇస్తారా అంటే, ఉద్యమాలు చేయటం వలన ఉపయోగం ఉండదని నాడు వ్యాఖ్యా నించారు. కానీ, ముఖ్యమంత్రి హోదా పై యూటర్న్ తీసుకున్న తరువాత ఆశోక్‌బాబు అదే బాటలో యూటర్న్ తీసుకున్నారు. హోదా కోసం ఉద్యోగ సంఘ నేతగా మద్దతు ప్రకటించవచ్చు. ప్రభుత్వం అధికారికంగా నిరసనలకు పిలుపునిస్తే అందులో పాల్గొనవచ్చు. కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయ ప్రకటనలు చేయటం పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఏపికి చెందిన ఉద్యోగ సంఘాలకు మాత్రమే ప్రతినిధి అనే విషయం మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కేంద్రం పై నిరసన వ్యక్తం చేయటం పై అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ, రాజకీ య ప్రకటనలు బిజెపిని ఓడించాలంటూ పిలుపునివ్వటం విమర్శలకు కారణం అవుతోంది. ఏపి ఉద్యోగ సంఘనేత అయిఉండి కర్నాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని అక్కడి తెలుగు వారి వద్దకు వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పటం చూస్తుంటే అది ఖచ్చితంగా అధికార పార్టీ ప్రాపకం కోసం మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. అశోక్‌బాబు వ్యవహార శైలిపై తొలి నుండి విమర్శలు ఉన్నాయి. ఆయన విద్యార్హత మీద ఫిర్యాదులున్నాయి.
ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకొని, ఉద్యోగ సంఘాల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ఆయన భజన బృందం ప్రచారం చేసింది. రాజకీయంగా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారే కానీ, అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పై మాత్రం దృష్టి పెట్టటం లేదనే విమర్శలు ఉన్నాయి. పీఆర్సీ బకాయిల పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి. ఏ రకంగా బకాయిలు చెల్లిస్తారనే దాని పై స్పష్టత తీసుకురాలేక పోయారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పని చేయకపోయినా, ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు.
టిడిపి నేతల ప్రాపకం ఉంటే చాలనే విధంగా తన స్థాయిని మరిచి బహిరంగంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, సమైక్య ఉద్యమ కాలంలో తనకు తానే ఆరడుగుల బుల్లెట్‌గా అనుచరులతో పిలిపించుకొనే వారు. అశోక్‌బాబు కారణంగానే అప్పట్లో సమైక్య ఉద్యమం విఫలమైందని వ్యాఖ్యానించే వారు ఉన్నారు. వైసిపి ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తే, కనీసం వారికి ఏపి ఉద్యోగుల తరపున సంఘీభావం కూడా ప్రకటించలేదు. టిడిపి ఏది చేస్తే అదే కరెక్ట్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏపి ఎన్జీవో సంఘ అధ్యక్షుడిగా కాకుండా టిడిపి అనుబంధ సంఘ నేతగా అశోక్‌బాబు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.