పొంగులేటికి జగన్ బంపర్ ఆఫర్, Jagan Bumper offer to Ponguleti

0
493

ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కీలక నిర్ణయాల దిశగా దూకుడు పెంచేశారు. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ శాఖల వారీ సమీక్షలను చేపట్టిన జగన్, నామినేటెడ్ పదవుల భర్తీపైనా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ఈ పదవుల భర్తీలో ఏపీ నేతల కంటే ముందుగానే తెలంగాణకు చెందిన నేతలకు, అది కూడా టీఆర్ ఎస్ నేతలకు ఆయ తీపి కబురు వినిపించనన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ నేత – ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్ ఏకంగా ఓ బంపరాఫర్ రెడీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పొంగులేటిని నియమించేందుకు ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నారని ఇక జగన్ నుంచి ఆదేశాలు వెలువడటమే తరువాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున తెలంగాణలోని ఖమ్మం స్థానం నుంచి బరిలోకి దిగిన పొంగులేటి అందరి అంచనాలను తలకందులు చేస్తూ ఎంపీగా విజయం సాధించారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాల్లో ఓ మూడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలుపునకు కూడా ఆయన తోడ్పడ్డారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి టీఆర్ ఎస్ లో చేరిపోయారు. వైసీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేశారు. తాజాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొంగులేటికి టీఆర్ ఎస్ టికెట్టివ్వలేదు.

అయితే ఏపీలో బంపర్ విక్టరీ సాధించిన జగన్, తెలంగాణలో తన పార్టీకి తొలి విజయాన్ని నమోదు చేసి పెట్టిన పొంగులేటికి టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా అవకాశం కల్పించాలని తీర్మానించారట. పూర్తిగా ఏపీకే చెందిన టీటీడీ పాలక మండలిలో అంతా ఏపీకి చెందిన వారే ఉన్నా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక – తమిళనాడుల నుంచి కూడా ప్రాతినిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు కూడా ఓ సీటును కేటాయించారు.

ఇప్పుడు ఈ తెలంగాణ కోటా సీటును పొంగులేటికి ఇవ్వాలని జగన్ తలచినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీడీపీ హయాంలో బాధ్యతలు స్వీకరించిన టీటీడీ బోర్డును రద్దు చేసిన బోర్డుకు నూతన పాలకమండలిని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ గా గతంలో పనిచేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి పేరు టీటీడీ చైర్మన్ పదవి రేసులోకి వచ్చారు. తాజాగా ఎంపీ టికెట్ దక్కని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ఈ రేసులోకి వచ్చేసింది. వీరు ముగ్గురిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణ కోటా సీటు మాత్రం పొంగులేటికే జగన్ ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here