టిడిపి నేతలను జెసి టార్గెట్ చేయటం వెనుక..!!
జెసి టిడిపికి వరమా..లేక శాపమా. జెసి దివాకర రెడ్డి..ప్రభాకర రెడ్డి ఇద్దరూ 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరి ఒకరు ఎంపీగా..మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారిద్దరి మాట తీరు ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ పై నోరు పారేసుకున్న జెసి ప్రభాకరరెడ్డి తీరు పై సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అయింది. జగన్ ను దూషించాడని టిడిపి శ్రేణులు సంబరపడినా..అది బూమ్‌రాంగ్ అయింది. ఇక, జెసి దివాకరరెడ్డి శైలి వేరు. ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు లేదని భావించిన ప్రతీ సందర్భంలోనూ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయటం ఆయనకు కొత్త కాదు. మహానాడు వేదికగా పార్టీ అధినేతను దులిపేసారు. తనను అడ్డుకోబోయిన ఎంపి రామ్మోహన్ నాయడును పక్కకు నెట్టేసారు.
మహానాడు వేదికగా నేరుగా ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకొని జెసి దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకే మింగుడు పడలేదు. ఇక, ప్రతీ సందర్భంలోనూ జగన్ పై విమర్శలు చేయటం ద్వారా ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్ర యత్నం చేస్తూనే ఉంటారు. వైయస్ రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తరువాత జెసికి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. అప్పటి నుండి వైయస్ మీద..ఆయన కుటుంబం మీద జెసి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక, అనంతపురం రాజకీయాల్లోనూ తన వర్గం కోసం పార్టీలోని ఇతర నేతల పై చేస్తున్న అసమ్మతి రాజకీయం సైతం జిల్లా టిడిపి నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకొనే పరిస్థితి లేదు. ఇక, ఉక్కు ఫ్యాక్టరీ కోసం కడపలో రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ దీక్ష చేస్తుండగా..అక్కడికి వెళ్లిన జెసి దివాకర్ రెడ్డి దీక్ష చేసినా..ఉక్కు కాదు..తుక్కు కూడా రాదని తేల్చి చెప్పేసారు. దీక్ష మాని భోజనం చేయాలని కుండ బద్దలు కొట్టారు. దీక్ష ద్వారా ఎంతో కొంత మైలేజ్ సాధిద్దామని భావించిన టిడిపి నేతలకు ఇది మింగుడు పడలేదు. వెంటనే మంత్రి ఆదినారాయణ ..దివాకర రెడ్డి పై ఓపె న్ గానే అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక, జిల్లాలో తన కుమారుడు, తన వర్గం కోసం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పై జెసి పలు మార్లు వివాదాస్పద కామెంట్లు చేసారు. కొంత కాలంగా ప్రభాకర రెడ్డి నోటి దురుసుతనం తగ్గినట్లుగా కనిపిస్తున్నా.. జెసి దివాకర రెడ్డి తీరు మాత్రం మారటం లేదు. దీంతో..జెసి టిడిపిని ముంచటానికి పార్టీలోకి వచ్చారా..లేక..పార్టీ కోసం మాట్లాడుతున్నారా అనే చర్చ ఇప్పుడు టిడిపి లోనే కొనసాగుతోంది.