ఏపి బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పేరు ఖరారైంది. రాష్ట్ర విభజన తరువాత బిజెపి లో చేరిన కన్నాకు ఏపి బాధ్యతలు అప్పగించాలని బిజెపి హైకమాండ్ నిర్ణయించింది. 14 ఏళ్లు మంత్రిగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా టిడిపికి బద్ద వ్యతిరేకి. కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో తొలుత సోము వీర్రాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పేర్లు తెర మీదకు వచ్చాయి. మాణిక్యాల రావు విముఖత వ్యక్తి చేయటంతో, కన్నా లక్ష్మీనారాయణ వైపు బిజెపి హైకమాండ్ మొగ్గు చూపింది. 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి కన్నా ఓడి పోయారు. ఆ తరువాత అమిత్షా సమక్షంలో బిజెపి లో చేరారు. టిడిపి, బిజెపి మధ్య సంబంధాలు తెగి పోయిన తరువాత బలమైన వాయిస్, కోస్తా జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందని కన్నా లక్ష్మీనారాయణ కు బిజెపి లో ప్రాధాన్యత పెరిగింది.
బిజెపి లో కొనసాగుండగానే తన మద్దతు దారులతో కన్నా తన రాజకీయ భవితవ్యం పై సమావేశం నిర్వహించారు. అందులో మెజార్టీ అభిప్రాయం మేరకు ఏప్రిల్ 25న వైసిపి లో చేరాలని, పెదకూరపాడు నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, కన్నా పార్టీ మారాలని నిర్ణయించిన తరువాత సడన్ గా అనారోగ్యానికి గురయ్యారు ఆస్పత్రిలో చేరారు. ఇదే, సమయంలో బిజెపి ముఖ్య నేతలు ఆర్‌యస్‌యస్ నాయకులు కన్నాను బుజ్జగించారు. పాలన పరంగా మంచి అనుభవం ఉండటంతో పాటుగా తొలి నుండి చంద్రబాబు పై ఫైర్ బ్రాండ్ గా కన్నా లక్ష్మీనారాయణ కు పేరుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి పైనా ముఖ్యమంత్రి పైనా విరుచుకుపడే నేతలు బిజెపికి అవసరంగా భావించారు. ఇక, సామాజిక సమీకరణాల్లోనూ కన్నాకు కలిసివచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి లోకి వచ్చిన నేతకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం పై ఏపి బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక, వైసిపి లో చేరకుండా కన్నా తమ మాట కోసం పార్టీలోనే కొనసాగటంతో, వచ్చే సాధారణ ఎన్నికల తరువాత కన్నాకు రాజ్యసభ సీటు సైతం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక, కన్నా అధికారికంగా ఏపి బిజెపి సారధ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.