ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదిలోనే వివాదం ముసురుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఉత్తర్వులు వెలువడటమే తరువాయని ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, సుబ్బారెడ్డి క్రిస్టియన్ అనే వివాదం తెరమీదకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైవీ సుబ్బారెడ్డి ఎంపీ పదవికి రాజీనామాచేశారు.
వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజర్ మెంబర్ అయిన వైవీ ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా పనిచేశారు. ఆ జిల్లాల్లో పార్టీ అధిక మెజార్టీతో గెలువడంలో కీలకపాత్ర వహించారు. పార్టీకి అత్యంత కీలకమైన నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, జగన్ ఈ నిర్ణయం తీసుకునన వెంటనే వైసీపీకి ప్రత్యర్థిగా ఉండే ఓ రాజకీయ పార్టీకి చెందిన వర్గాలు రంగంలోకి దిగాయి. వికీపీడియాలో వైవీ సుబ్బారెడ్డి వివరాలను ఎడిట్ చేశాయి. ఆయన క్రిస్టియన్ అంటూ అప్‌డేట్ చేశాయి. దీంతో కలకలం రేగింది. అయితే, పలువురు ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు. సుబ్బారెడ్డి నుదుటన కుంకుమ పెట్టుకున్న ఫొటోలతో వారికి ఘాటు కౌంటర్ ఇచ్చారు.