ఏపిలో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా..!టిడిపి- వైసిపి లు ఏం కోరుకుంటున్నాయి.? పంచాయితీ ఎన్నికలు జరిగితే ఎవరిది పై చేయి అవుతుంది.? ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు 2013 లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి వాటి కాలపరిమితి ముగుస్తుంది. గడువు లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ, వార్డుల రిజర్వేషన్, వంటి అంశాలను పూర్తి చేయాలని కోరింది. అయితే, ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా లేదని తెలుస్తోంది. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏపిలో రాజకీయంగా మారుతున్న సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని పంచాయితీ ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లటమే మంచిదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 2014 లో జరిగిన పంచాయితీ ఎన్నికల సమయానికి వైసిపి సంస్థాగతంగా బలం పుంజుకోలేదు.
జగన్ అప్పటి వరకు జైల్ లో ఉండటం..పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోకపోవటం..జనాదరణ పైనే పార్టీ ఆధారపడటంతో 2013 లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తిన్నది. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రతీ గ్రామంలో వైసిపికి కేడర్ ఏర్పడింది. పంచాయితీ ఎన్నికలు జరగాలని వైసిపి కోరుకుంటుంది. సాధారణంగా పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తు పైన జరగవు. అధికార పార్టీ వైపే గెలిచిన అభ్యర్ధులు మొగ్గు చూపటం సాధరణంగా జరిగే విషయం. అయినప్పటికీ, అధికార తెలుగు దేశం పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వైసిపి ఈ సారి పంచాయితీ, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే పాదయాత్ర ప్రభావం ఆ ఎన్నికల పై ఉంటుందని..ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో బలం నిరూపించు కోవటం ద్వారా సాధారణ ఎన్నికలకు అన్ని రకాలుగా కేడర్ సిద్దమవుతుందని వైసిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోసం వైసిపి సిద్దమనే సంకేతాలు ఇస్తుంటే..అధికార టిడిపి దీని పై ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.