నిజంగా జగన్-పవన్ కలుస్తారా. టిడిపి ఆరోపణల్లో నిజమెంత. జగన్ కు పవన్ తో కలవాల్సిన అవసరం ఉందా. ఈ ఇద్దరు కలిస్తే టిడిపి లాభమా- నష్టమా. ఇప్పుడు ఈ చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ మొదలైంది. జగన్-పవన్ అభిమానుల్లోనూ వినిపిస్తున్న చర్చ. నాలుగేళ్ల కాలంగా టిడిపి – వపన్ టార్గెట్ జగన్ గా వ్యవహరించారు. అయితే, గుంటూరు లో జనసేన ఆవిర్భావ సదస్సులో టిడిపి ప్రభుత్వం పై అవినీతి ఆరోపణల ద్వారా పవన్-టిడిపి మధ్య స్నేహానికి బీటలు వారాయి. జగన్ వ్యవహారంలో టిడిపి -మద్దతు మీడియా ఏ రకంగా అయితే వ్యవహరించారో, ఇప్పుడు సరిగ్గా పవన్ పైనా అదే తీరున వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో, వచ్చే ఎన్నికల్లో జగన్- పవన్ కలుస్తారనే వాదనకు దిగిన టీడిపి దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జగన్ – పవన్ ఇద్దరికి ఇప్పడు ఉమ్మడి శత్రువు టిడిపినే. అయితే, 2014 ఎన్నికల్లోనే బిజెపి పొత్తు కోసం ముందుకు వస్తే జగన్ నిరాకరించారు. ఆ ఎన్నికల్లో టిడిపి-బిజెపి-పవన్ కలిస్తే వారి పై జగన్ ఒంటరి పోరు చేసారు. ఆ ఎన్నికల్లో మెదీ ఛరిష్మా-పవన్ ప్రభావం సహకరించటంతోనే టిడిపి అధికారంలోకి వచ్చిందని అందరూ ఒప్పు కొనే విషయమే. అయితే, ఇప్పుడు టిడిపి కి ప్రధాన పోటీ దారుగా వైసిపి ఉంది.
జనసేన తో వామపక్షాలు కలిసి ఉన్నాయి. ఇక కాంగ్రెస్, బిజెపి లది దాదాపు ఒంటరి పోరే. టిడిపి ది వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోరు జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత చీలి టిడిపి కే అనుకూలంగా మారుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. కానీ, దీంతో వైసిపి నేతలు విభేదిస్తున్నారు. గతంలో అందరూ కలిసి పోటీ చేసినా వైసిపి ఒంటరిగా ఫైట్ చేసినా అధికారం- ప్రతిపక్షం మధ్య ఓట్ల తేడా కేవలం 1.95 శాతమనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతం కంటే ఇప్పుడు టిడిపి పై వ్యతిరేకత పెరిగిందని, వైసిపి కి ఆదరణ పెరిగిందని, ఎవరితోనూ పొత్తు కట్టాల్సిన అవసరం ఇప్పటి వరకూ లేదని వైసిపి నేతలు చెబుతున్నారు. కాన, జనసేనలో మాత్రం అంతర్గతంగా మరో చర్చ మొదలైంది. జగన్ తో ప్రత్యేక హోదా అంశం పై కలిసి, కామన్ అజెండా గా ఎన్నికలకు వెళ్తే, ఖచ్చితంగా మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తు లపై జగన్ సైతం అనేక ఇంటర్వ్యూ ల్లో ఒకటే విషయం స్పష్టం చేసారు. ఎవరైతే ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తారో వారితోనే కలుస్తామని తేల్చి చెప్పారు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలోనూ చూస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, అసలు నిజంగా పవన్ తో కలవాల్సిన అవసరం జగన్ కు ఉందా లేదా, పొత్తు పెట్టుకుంటే వైసిపి కి లాభమా, నష్టమా, అనేది జగన్ అభిమానులే తేల్చాలి.