పవన్ కళ్యాన్ టిడిపి తో కలుస్తారా. మరి ఇప్పుడు పవన్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారు. పవన్ కలుస్తాడని టిడిపి నే తలు మైండ్ గేమ్ ఆడుతున్నారా, లేక నిజంగానే ఆ మేరకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయా. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్‌లో స్థిరత్వం, పట్టుదల లేవనీ, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే భవిష్యత్తులో టీడీపీతో కలిసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఏబిఎన్ ఆర్కేతో ఓపెన్ హార్ట్ లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లోనే స్పష్టం చేసారు. 2014 లో టిడిపి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాన్ తన వంతు సహకారం అందించారు. నాలుగేళ్ల పాటు టిడిపికి పవన్ మిత్రుడుగానే ఉన్నారు.
గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో టిడిపి ప్రభుత్వంలో అవినీతి, లోకేష్ పైన అవినీతి ఆరోపణలతో పవన్-టిడిపి మధ్య గ్యాప్ పెరిగింది. అప్పటి నుండి పవన్ కళ్యాన్ ను టిడిపి నేతలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. పవన్ బిజెపి కనుసన్నల్లో పని చేస్తు న్నారని విమర్శిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పార్టీలో సీనియర్ గా ఉన్న నిమ్మకాయల చిన రాజప్ప తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాన్ టిడిపి పైనా టిడిపి మద్దతు మీడియా మీద ఫైర్ అవుతున్న సమయంలో చినరాజప్ప భవిష్యత్‌లో పవన్ కళ్యాన్ టిడిపి తో కలిసే అవకాశాలు లేకపోతేదని చెప్పటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు అటువంటి సంకేతాలు లేకుండా చిన రాజప్ప అటువంటి వ్యాఖ్యలు చేస్తారా అనే సందేహం కలుగుతోంది.
వైసిపి ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి-పవన్ కళ్యాన్ విడివిడిగా పోటీ చేయటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని తద్వారా తమకు మేలు జరుగుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఏ ఎన్నికల్లోనూ టిడిపి ఒంటరిగా పోటీ చేయలేదని ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి తగినట్లుగా ఇప్పుడు టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
రాజకీయాల్లో ఎటువంటి వివాదాలు లేని పొలిటిషియన్‌గా నిమ్మకాయల చినరాజప్పకు పేరుంది. కాపు సామాజిక వర్గంలోనూ చినరాజప్ప కు గోదావరి జిల్లాల్లో పెద్ద తలకాయ గా టిడిపి నుండి ఉన్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుండి పవన్ కు మద్దతు ఎక్కువగా ఉంటున్న పరిస్తితుల్లోనే వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసారా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే టిడిపి నుండి అనేక మంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, కాపు రిజర్వేషన్ల అంశంలో టిడిపి హామీ నిలబెట్టుకోకపోవటంతో, ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. దీంతో పవన్ వైపు టిడిపి ఇంకా ఆశగా చూస్తుందా, లేక నిజంగానే చిన రాజప్ప చెప్పినట్లుగా పవన్ టిడిపి తో కలిసే అవకాశాలు ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. పవన్, టిడిపి తో కలిస్తే ఆయన అభిమానులు అంగీకరిస్తారా అనేది కూడా సందేహమే.