వైసిపి ఫైర్‌బ్రాండ్ పై ఈ సారి పోటీ చేసేది టిడిపి నుండి ఎవరో తేలిపోయింది. వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేసారు. అక్కడ రోజా గెలుపొందారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు అకాల మరణంతో ఆయన సతీమణికే టిడిపి తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నగరి నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాలి తనయులిద్దరూ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీగా గాలి సతీమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, వచ్చే శాసనసభ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమ కుటుంబానికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు టిడిపి నుండి కనిపిస్తున్నాయి.
రోజా పై ఎవరిని బరిలోకి దింపాలనే అంశం పై అనేక మంది పేర్లు టిడిపి తెర మీదకు తెచ్చింది. నాటి హీరోయిన్ వాణీ విశ్వనాద్ పేరు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత జీవిత పేరును ప్రతిపాదించారు. తాజాగా, నగరి నుండి ఓ ఐఏయస్ పేరు వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవ స్థానంలో జెఈవో గా పని చేస్తున్న శ్రీనివాసరాజు పేరు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో బాగా ప్రచారం లో ఉంది. ఏడేళ్ల కాలంగా టిటిడి జెఈవో గా శ్రీనివాస రాజు పని చేస్తున్నారు. ఆయనకు ఢిల్లీలో న్యాయ కోవిదులు వద్ద ఉన్న పరిచయాలు, ముంబై కి చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన ప్రభుత్వ పెద్దల పై ఒత్తిడి తో ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా మరో రెండేళ్ల పాటు శ్రీనివాస రాజును టిటిడి జెఈవో గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాయలసీమ లోని ఓ జిల్లా లో ఉన్నతాధికారిగా ఉన్న మరో ఐఏయస్ ను అరకు నుండి టిడిపి అభ్యర్దిగా పోటీ చేయించటానికి టిడిపి అధినాయకత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక, తిరుమల నుండి సేవలు అందిస్తూనే నగరి పై దృష్టి పెట్టాలనేది శ్రీనివాసరాజు ఆలోచనగా తెలుస్తోంది. శ్రీనివాస రాజు టిడిపి అధినాయక త్వం పై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టిడిపి ముఖ్య నేతలు సైతం సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అక్కడ ఎంతో కాలంగా టిడిపి నే నమ్ముకున్న నేతలు ఉన్నారు. ఇక, గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం నుంది ఆయన ఇద్దరు కుమారులు సైతం టిక్కెట్ అశిస్తున్నారు. నగరి పొరుగు నియోకవర్గం చంద్రగిరి బాధ్య తల నుండి తాజాగా గల్లా అరుణ తప్పుకున్నారు. ఇప్పుడు నగరి నుండి ఐఏయస్ అధికారి శ్రీనివాస రాజు పేరు పరిగణలో కి తీసుకున్నట్లు గా ప్రచారం మొదలవ్వటంతో టిడిపి లో కలకలం మొదలైంది. దీని పై టిడిపి అధినాయకత్వం వద్ద స్ప ష్టత తీసుకోవటానికి గాలి కుటుంబ సభ్యులతో పాటుగా నగరి టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నగరి లో వైసిపి ఎమ్మెల్యే రోజా పై శ్రీనివాస రాజు పోటీ చేయటం ఖాయమని ఆయన సన్నిహితులు చెబు తున్నారు. దీని పై మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. అయితే, అసలు రోజా వాగ్దాటిని నగరి లో రోజా కు ఉన్న ఫాలోయింగ్ ను తట్టుకొనే శక్తి సామర్ధ్యాలు రాజకీయంగా శ్రీనివాస రాజుకు ఉన్నాయా అనేదే ఇప్పుడు మొదలైన చర్చ. దీంతో ఇప్పుడు నగరి హాట్ టాపిక్ గా మారింది.