సుజనా చౌదరి బిజెపిలో చేరుతున్నారా. జగన్ చెప్పిందే నిజం అవుతోందా. టిడిపిలో ని అత్యున్యత స్థాయి నేతలు మాత్రం అవుననే అంటున్నారు. లోకేష్ సైతం చౌదరి పార్టీ మారుతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుజనా మంత్రి పదవి వీడినా బిజెపి పెద్దలతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్యులుగా ఉన్న ‘ఎన్సీబీఎన్’ వాట్సాప్ గ్రూప్‌లో సుజనా పార్టీ మారడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించినట్టు తెలుస్తోంది. ‘మాకు అలాంటి సమాచారం ఏదీ అందలేదు. వాస్తవం వెలుగులోకి వచ్చేవరకు వేచిచూద్దాం’ అని సుజనా పార్టీ మారడంపై గ్రూప్‌లో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ లోకేశ్ కామెంట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జాతీయ ఆంగ్లదిన పత్రిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ స్పందన అటు నిర్ధారించడం కానీ, ఇటు ఖండించడం కానీ కాకుండా తటస్థంగా ఉండటంతో ఈ అంశంపై గ్రూప్‌లో మరింత చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం సుజనా చౌదరి తీరు టీడీపీ అంతటా చర్చనీయాంశంగా మారింది. సుజనా దారిలోనే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీని వీడే అవకాశము న్నట్లు టిడిపి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి విరాళాల సేకరణ, ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో సుజనా కీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విషయాల్లోనూ ఆయన ప్రధాన పాత్ర వహించారు. కేబినెట్ మంత్రుల ఖరారు నుంచి కీలక కీలక ప్రాజెక్టుల అప్పగింత వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు.
చంద్రబాబుకు విశ్వసనీయుడు కావడంతో కేంద్రమంత్రి పదవి కూడా ఆయనను వరించింది. చంద్రబాబు సందేశాలను ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేరవేయడంలో, ఢిల్లీలో టీడీపీ తరఫున పనిచేయడంలో సుజనా ప్రముఖంగా వ్యవహరించారు. రాష్ట్రానికి, టీడీపీకి ఢిల్లీలో ఏకైక ప్రతినిధి తానే అన్నట్టుగా సుజనా వ్యవహారం సాగిపోయింది. అయితే, చౌదరి నిజంగా బిజెపిలో చేరుతున్నారా, లేక కేంద్రం టిడిపి అవినీతి పై చర్యలకు సిద్దమవుతుం దనే సమాచారం తో సుజనా చౌదరి వ్యూహాత్మకంగానే బిజెపి పెద్దలతో కలిసి ఉంటున్నారా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. తాజాగా వైసిపి అధినేత జగన్ సైతం సుజనా చౌదరి ఢిల్లీలో బిజెపి పెద్దలను గవర్నర్ తో నూ ఏకాంతంగా సమావే శమయ్యారని దీని పై ఎల్లో మీడియా ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు టిడిపి నేతలు సైతం జగన్ వాదననే సమర్ధించేలా అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. సుజనా లాంటి వారే నిజంగా టిడిపి ని వీడితే.. ఖచ్చితంగా చంద్రబాబు కోర్ టీం కష్టాల్లో పడుతున్నట్లే. ఇది సుజనా తో ఆగే పరిస్థితి ఉండదు.