సంచలనం. టిడిపి అధినేత చంద్రబాబు ను 1995లోనే పార్టీ నుండి బహిష్కరించారా. మరి ఆ నిర్ణయం ఎందుకు అమ లు కాలేదు. 1994 ఎన్నికల్లో టిడిపి ఏపిలో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఆగస్టులో లక్ష్మీ పార్వతి ని కారణంగా చూపించి చంద్రబాబు వర్గం ఎన్టీఆర్ పై తిరుగుబాబు బావుటా ఎగర వేసింది. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వైశ్రాయ్ హోటల్ లో చంద్రబాబు కు మద్దతుగా ఎమ్మెల్యేలు క్యాంపు నిర్వహించారు. ఆ హోటల్ వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ చైతన్య రధం వాహనం పై చంద్రబాబు మద్దతు దారులు దాడి చేసారు. ఆ తరువాత ఆగస్టు 25న పార్టీ అధ్యక్షుడి హోదా లో ఎన్టీఆర్ పార్టీ నుండి చంద్రబాబు తో సహా మరో నలుగురిని పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసన సభా స్పీకర్ కు లేఖ రాసారు. అందులో చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి రాజు, దేవేందర్ గౌడ్, కోటగిరి విధ్యాధర రావు, మాధవరెడ్డి పేర్లు ఉన్నాయి. అయితే, అప్పుడు స్పీకర్‌గా వ్యవహరించిన వ్యక్తి సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలవటంతో సభలో అధ్యక్షుడి హోదాలో ఎన్టీఆర్ ఇచ్చిన లేఖ చెల్లుబాటు కాలేదు.
ఎన్టీఆర్ సంతకం తో ఇచ్చిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తుంది. నాడు ఎన్టీఆర్ పార్టీ నుండి బహిష్కరించిన చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుతం ఉన్నారు. ఇక, అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రి గా పని చేసి ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్నారు. దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం ముగియటంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాధవరెడ్డి, కోటగిరి విధ్యాధరరావు మరణించారు. అసలు 1995 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన లేఖ అసెంబ్లీ రికార్డుల్లో లేదా ఎన్టీఆర్ ఆత్మీయుల వద్ద ఉండాలి. కానీ, ఇన్నాళ్లకు ఇప్పుడు ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ లేఖ పై టిడిపి లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖ 1995 ఆగస్టు 25న రాసినట్లుగా ఉంది. సరిగ్గా వారం తరువాత ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు ఏపి నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఈ లేఖ వెలుగులోకి రావటం తో నాటి రాజకీయాలను తిరిగి నేడు గుర్తు చేసుకుంటున్నారు.