టిడిపి లో ఆంధ్రజ్యోతి కధ అడ్డం తిరిగింది.
ఆంధ్రజ్యోతి సర్వే టిడిపికి తల నొప్పులు తెచ్చి పెట్టిందా? అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పరిస్థితి అధికార పార్టీకి అనుకూలంగా ఉందని చెబుతూ మూడు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి సర్వే ప్రచురించింది. అయితే, సాధారణంగా ఆ పత్రికలో ప్రభుత్వంలోని కొందరు ప్రముఖుల సూచనల మేరకే కధనాలు వస్తాయని ఆ పార్టీ నేతలు బాగా నమ్మే అంశం. ఇక, ఇప్పుడు అదే నమ్మకం పార్టీలోని కొందరు సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఏకంగా మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి లో గంటా పై వ్యతిరేకత ఉందనే కధనం ఇప్పుడు గంటాను ఏకంగా పార్టీకి దూరంగా జరిగే పరిస్థితి తీసుకొచ్చింది.
ఆంధ్రజ్యోతి అంత ప్రముఖుంగా టిడిపికి అనుకూలంగా సర్వే ప్రచురించినా..టిడిపి నేతలు దానిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొనే పరిస్థితిలో లేరు. టిడిపి నేతలు సైతం ఈ సర్వేను లైట్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, వైసిపి నేతలు ఈ సర్వేను తప్పు బడుతున్నారు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా లగడపాటి ఎటువంటి సర్వే ఆంధ్రజ్యోతి కోసం చేయలేదని ప్రకటించారు. దీంతో..ఈ సర్వే నిబద్దత పైనమ్మకం కోల్పోయింది. ఇక, గంటా తో పాటుగా రాయలసీమ కు చెందిన టిడిపి నేతలు సైతం ఈ సర్వే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో జరుగుతున్న వర్గ పోరులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీలో పావులు కదుపుతున్నారనే అనుమానం గంటా వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలతోనే గంటా క్యాబినెట్ సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు. దీని పై బుజ్జగింపులు సైతం ప్రారంభమైనట్లు సమాచారం. గంటాను రాజకీయంగా నైతికంగా దెబ్బ తీయటంలో భాగంగానే ఈ సర్వేను పార్టీలోని కొందరు సీనియర్లు చేయించారని ప్రచారం జరుగుతోంది. గంటా పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని.. ఆయన జనసేన వైపు చూస్తున్నారనే సమాచారంతో..ఆయన్ను దెబ్బ తీసేందుకే ఈ సర్వే ద్వారా ఎత్తులు వేసారని గంటా సన్నిహితులు ఆరోపిస్తున్నారు. టిడిపికి టానిక్ లా పని చేస్తుందని భావించిన ఆంధ్రజ్యోతి సర్వే ఇప్పుడు టిడిపి కే కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.