ఆ రెండు సీట్లు వైసిపి ఖాతాలోకేనా? కర్నూలు ఎంపీ..కర్నూలు ఎమ్మెల్యే సీట్లను టిడిపి ఖరారు చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలుకు తుది రోజు ముందు రాత్రి వరకు సీట్లు ఎవరికో టిడిపి ఖరారు చేయదు. అటు వంటి టిడిపిలో ప్రధాన కార్యదర్శి..ముఖ్యమంత్రి తనయుడు మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ సడన్ గా అభ్యర్ధును ప్రకటించారు. కర్నూలు పర్యటనలో ఉన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపిగా బుబ్టా రేణుక..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ ఎంపిక పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిసి జరిగిందా..లేక లోకేష్ అత్యుత్సాహంతో చేసిన ప్రకటనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక, అదే వేదిక పై రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ సైతం ఉన్నారు. ఆయన తనయుడు భరత్ సైతం వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మె ల్యే టిడిపి తనదే అని ప్రచారం చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఈ రకంగా ప్రకటన చేయటంతో ఒక్కసారిగా టిజి వెంకటేష్ షాక్ అయి..అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక, 2014 ఎన్నికల్లో వైసిపి నుండి ఇవే నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలిచిన ఈ ఇద్దరు ఇప్పుడు..2019 ఎన్నికలకు టిడిపి అభ్యర్దులుగా ఖరారు చేయటం పై టిడిపి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఎప్పటి నుండో టిడిపిని నమ్ముకొని ఉన్న పార్టీ శ్రేణుల్లో ఒక్క సారిగా అసంతృప్తి మొదలైంది. స్థానికంగా పార్టీ శ్రేణుల అభిప్రాయం సేకరించకుండా అభ్యర్ధులను ప్రకటించటం తో పార్టీలో కొత్త సమస్యలు ఖాయమనే వాదన మొదలైంది. ఇక, వైసిపి నుండి గెలిచి పార్టీ ఫిరాయించిన వారి పై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు ఉన్నాయి. తాజాగా చేయించిన సర్వేలోనూ ఇదే తేలింది. అటువంటి వారికి టిడిపి టిక్కెట్లు ఖరారు చేయటం తో వైసిపికి మేలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక, కర్నూలు జిల్లాలో ఒక ఎంపి సీటు బిసి వర్గాలకే ఇస్తామ ని..వైసిపి అధినేత జగన్ పాదయాత్రలోనే ప్రకటించారు. ఇక, కర్నూలు సిటీ ముస్లిం మైనార్టీ వర్గానికి ఇచ్చే అవకాశం కని పిస్తోంది. తుది ప్రకటన చేయకపోయినా..ఎన్నికల నాటికి సమీకరణాలు పరిశీలించిన తరువాత అభ్యర్ధులను ఖరారు చే యాలనేది జగన్ వ్యూహం. ఇప్పుడు లోకేష్ చేసిన ప్రకటనతో టిడిపిలో అసంతృప్తి..వైసిపి లో కొత్త జోష్ కనిపిస్తున్నాయి. వైసిపి నుండి ఫిరాయించిన వారిని ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపించటం లేదు. అయితే, ఈ ప్రకటన పై టిడిపి దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు