విశాఖలో టిడిపి లో కలకలం. అధికార పార్టీ నుండి ప్రముఖుల వలసలు. వైసిపి వైపు పరుగులు. అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన విబేధాలు ఇప్పుడు ఆ పార్టీకి నష్టం చేస్తున్నాయి. పార్టీలో పరిస్థితులు..ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అర్దం చేసుకుంటున్న పార్టీ నేతలు వైసిపిలోకి వలసల బాట పట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు టిడిపి వీడేందుకు రంగం సిద్దమైంది. అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి..వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తో కొంత కాలంగా అవంతి కి విబేధాలు మొదలయ్యాయి. దీంతో..ఎట్టి పరిస్థితుల్లో నూ గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుండే బరిలోకి దిగాలని అవంత భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో అవంతి ప్రజారాజ్యం పార్టీ నుండి అదే భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత గంటా తో కలిసి టిడిపి లో చేరి అనకాపల్లి ఎంపీగా గెలిచారు.
టిడిపి నేతల తీరుపై కొంత కాలంగా అవంతి ఆగ్రహంతో ఉన్నారు. దీంతో..వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ నుండి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి..మంత్రి కావాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. విశాఖలో వైసిపి కార్యక్రమాలను తన భుజస్కందాల పై మోస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం కొద్ది రోజుల క్రితం మంత్రి గంటా వైసిపి నేతలతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. అయితే, ఇప్పుడు అవంతి సైతం వైసిపితో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. భీమిలి వైసిపి నేత ఒకరు అవంతి రాక ఖరారు కావటంతో..ఆయన రాకను అడ్డుకోవాలంటూ వాట్సప్ గ్రూప్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది ఇప్పుడు టిడిపి – వైసిపి లో చర్చనీయాంశంగా మారింది. జగన్ విశాఖ జిల్లాలో పాద యాత్ర ద్వారా ప్రవేశించే సమయానికి మరి కొంత మంది టిడిపి ప్రముఖులు టిడిపి వీడి వైసిపి బాట పట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.