టిడిపి అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోందా. టిడిపి నేతల్లో అలజడి ఎందుకు మొదలైంది. ఉమ్మడి ఏపి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తీ సుకున్న వివాదాస్పద నిర్ణయాల పై ఇప్పుడు విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం పైనా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఏపి సీయం చంద్రబాబు టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా కేంద్రం తమ పై చర్యలు తీసుకోవచ్చని ఏపికి చెందిన పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, మీడియా పై సిబిఐ విచారణ జరిగే అవకాశాలు ఉ న్నాయని స్వయంగా టిడిపి అధినేతే అనుమానం వ్యక్తం చేసారు. ఇటువంటి సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు పుదుచ్చేరి సీయం తో కలిసి కేంద్ర ఆర్దిక విధానాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష తన సమావేశం జరిగింది.
కేంద్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి ఎవరూ హాజరు కాలేదు. టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో కెసిఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ ను చాలా లైట్ గా తీసుకొని వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ శాఖ అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఓటు కు నోటు కేసుతో పాటుగా ఉమ్మడి ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పైనా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ముందు రోజే గవర్నర్ తోనూ తెలంగాణ సీయం సమావేశమయ్యారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్‌జి సంస్థకు హైదరాబాద్ లోని స్టేడియంలను అప్పగించడానికి తీసుకున్న నిర్ణయంపై విచారణ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ సంస్థకు గోల్ఫ్ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమా చారం.
చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏ కేసు పైనా ఆరు నెలల కు మించి స్టే ఉండటానికి వీళ్లేదని సుప్రీం ఆదేశాలివ్వటం, ఇప్పుడు ఈ వ్యవహారాల పై సడన్ గా కెసిఆర్ విచారణ చేయటం వెనుక చూస్తుంటే ఇది టార్గెట్ చంద్రబాబు గా అడుగులు పడుతున్నట్లు అర్దమవుతోంది. తెలంగాణ సీయం కార్యాలయంలో అయిదు గంటల పాటు సాగిన పోలీసు- న్యాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశంతో టిడిపి నేతల్లో అలజడి మొదలైంది. ఒక వైపు కేంద్రం, మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి వేస్తున్న అడుగులు రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు కారణం అవుతాయో అనే ఉత్కంఠ ఇప్పుడు ఏపిలో కనిపిస్తోంది.