తెలుగుదేశం ఆశలు అడియాశలు. టిడిపి పిలుపును బేఖాతర్ చేసిన కన్నడ తెలుగు ప్రజలు. కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ ఎంత బాధ పడుతుందో కానీ, ఏపిలో టిడిపి నేతలు మత్రం కర్నాటకలో బిజెపి ది విజయమే కాదంటున్నారు. కర్నాటక ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని అంచనా వేసిన టిడిపి నేతలు..ఆ క్రెడిట్ తమ ఖాతాలో ఎంతో కొంత వేసుకోవాలనని ఆశించారు. కానీ, ఊహించని భంగపాటు ఎదురైంది. కర్నాటకలో బిజెపికి ఓట్లు వేయవద్దని అక్కడి తెలుగు ప్రజలకు పిలుపు ఇస్తున్నామంటూ ఊదరగొట్టారు. టిడిపి ప్రతినిధులుగా కొంత మంది కర్నాటకలో మకాం వేసారు. తెలుగు ప్రజల తో సమావేశాలు నిర్వహించారు. కానీ, ఫలితం ఊహించలేదు.
బిజెపి అధికారం దక్కించుకుంది. ఇది కాంగ్రెస్ కంటే ఎ క్కువగా టిడిపి నేతలు బాధ పడుతున్నారు. కర్నాటక ఫలితాల తరువాత ఇక ఆపరేషన్ ఏపి ని బిజెపి ప్రారంభిస్తుందని బిజెపి నేతలు చెబుతూ వచ్చారు. అయితే, కర్నాటకలో బిజెపి ఓడిపోతే..ఆత్మరక్షణలో పడుతుందని..ఇక, ఏపి వ్యవహారా ల పై దృష్టి పెట్టే అవకాశం లేదని టిడిపి నేతలు అంచనా వేసారు. దీంతో..టిడిపి అధినేత సైతం తాము బిజెపికి ఓటు వేయవద్దని చెప్పాం కానీ, ఏ పార్టీకి వేయాలో చెప్పలేదనే విషయాన్ని స్పష్టం చేసారు. కానీ, తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగుళూరు నగరం లోని నియోజకవర్గాల్లో అధికంగా బిజెపి గెలుచుకుంది. ఇక, కేంద్ర ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తరువాత దక్షిణాది రాష్ట్ర ప్రతినిధులతో ఏపి ప్రభుత్వం లీడ్ తీసుకొని సమావేశాలు నిర్వహించింది. దీని ద్వారా కర్నాటక ప్రజల్లో బిజెపి దక్షిణాది ప్రాంతానికి వ్యతిరేకమనే భావన కల్పించేందు కు ప్రయత్నాలు చేసింది. కానీ, ఇవేవి పని చేయలేదు.
కర్నాటక రాజకీయాల్లో టిడిపికి ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా.. బిజెపి ఓటమిని టిడిపి కోరుకుంది. కర్నాటక లో ప్రచారం ముగించుకొని శ్రీవారి దర్శనానికి వచ్చిన బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పైనా టిడిపి కార్యకర్తలు దాడి చేసారనే వార్తలు వచ్చాయి. వీటి ద్వారా బిజెపి పెద్దలు టిడిపి చేస్తున్న యాక్టివిటీ పై సీరియస్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కర్నాటక లో ఫలితాలు తమకు అనుకూలంగా రావటంతో అక్కడ ఈ నెల 17న ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ తరువాత ఇక ఏపి పైనే బిజెపి హైకమాండ్ ఫోకస్ చేయనుందని సమాచారం. దీంతో..రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారింది.