ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అంతేకాదు తాను ప్రవేశపెట్టిన, ప్రకటించిన సంక్షేమ పథకాల దృష్ట్యా చాలా జాగ్రతలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే తాను ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల పెన్షన్లను పెంచడమే కాకుణ్దా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న అన్ని బెల్టు షాపులను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు రూ.3 వేల రూపాయలుగా ఉన్న ఆశా వర్కర్ల నెలసరి జీతాన్ని రూ.10 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవేర్చడంలోనే పూర్తిగా దృష్టిపెట్టి వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు సక్రమంగా అందుతున్నయా లేదా అనే దానిని సమీక్షించేందుకు ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. దీని కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలని భావిస్తున్నారట. అయితే నవరత్నాల హామీల అమలు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ పేరును జగన్ పరిశీలిస్తున్నారని పార్టీ శ్రేణులలో చర్చలు జరుగుతున్నాయట. ఏది ఏమైనా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తాను ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరాలని, ఎక్కడా అవినీతి అనేది జరగకూడదనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్న సమాచారం.