వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఉండే ప్రాధాన్యత గురించి పరిచయం అవసరం లేదు. వైసీపీ కోసం విజయసాయిరెడ్డి సైతం అదే రీతిలో శ్రమిస్తుంటారు. ఆ శ్రమ ఫలితంగా ఏపీలో తొలి నామినేటెడ్ పదవి దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణప్రసాద్, ప్రధానకార్యదర్శిగా పురుషోత్తమ్ వ్యవహరించనున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సమావేశం అయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
మొత్తం 8 కమిటీలను అనుబంధ కమిటీలుగా ఏర్పాటు చేశారు. ఆ సంఘం నూతన కార్యవర్గం ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తాను శాసనసభ్యుడిగా కంటే క్రీడాకారుడినని చెప్పుకోవడం తనకెంతో ఇష్టమన్నారు. హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్ కబ్జాలో ఉందని, ఆ సమస్యను పరిష్కరిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారన్నారు.
త్వరలో గుంటూరులో ‘ఏపీ ఒలింపిక్ భవన్’ నిర్మాణం చేపడతామని ఆయన హమీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఆహారహం శ్రమించిన విజయసాయిరెడ్డికి తొలి మరియు కీలక నామినేటెడ్ పదవి కట్టబెట్టడం వల్ల పార్టీకి అండగా ఉండే వారికి తగు ప్రాధాన్యం దక్కుతుందనే సందేశాన్ని అందించారని పలువురు చర్చించుకుంటున్నారు.